దుబ్బాక ఎన్నికల కాక..! సిద్దిపేటలో ఉద్రిక్తత..!!

 

(సిద్ధిపేట నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రఘునందనరావు మామ రాంగోపాలరావు, బంధువు అంజన్ రావు నివాసాల్లో సోదాలు జరిపారు. రాంగోపాలరావు నివాసంలో దాదాపు 18లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రఘునందనరావు అక్కడకు చేరుకోవడంతో లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో వాద్వివాదానికి దిగారు. దోపులాటలో రఘునందరావు సొమ్మసిల్లి పడిపోయారు.

కాగా రాంగోపాలరావు నివాసం నుండి ఒ కానిస్టేబుల్ డబ్బుల సంచీతో బయటకు రాగా కొందరు బీజేపీ కార్యకర్తలు కానిస్టేబుల్‌ మీదకు వెళ్లి బ్యాగ్‌లోని నగదు అందినంత లాక్కొని పరారు అయ్యారు. అయితే కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు వెనక్కు తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మరో వైపు టీఆర్ఎస్ నేత, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.

అధికారుల సోదాలపై బీజేపీ అభ్యర్థి రఘునందరావు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏ ఆధారాలతో తమ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ ఓటమి భయంతోనే నీచ రాజకీయాలు చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో పక్క పలువురు బీజెపి నేతలు పోలీసులు, ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని బీజెపి నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ కోరారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ మూడవ తేదీన జరగనున్నది. పదవ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.