NewsOrbit
రాజ‌కీయాలు వ్యాఖ్య

‘అసమ్మతి హక్కు కాపాడుకోవడం అత్యావశ్యకం’

ఆగస్ట్ 28 వ తారీఖున పూణే పోలీసులు ఐదుగురు సామాజిక కార్యకర్తల ఇళ్ళల్లో సోదాలు జరిపి, వారి మీద  ‘అర్బన్ నక్సల్స్’ అని ముద్ర వేసి వారి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు జప్తు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు – ప్రజా మేధావి ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్, మానవ హక్కుల న్యాయవాది అరుణ్ ఫెరేరా, మానవ హక్కుల కార్యకర్తలు వెర్నాన్ గొంజాల్వెస్, గౌతం నవలఖ.

రొమిల్లా థాపర్, మరికొంతమంది కలిసి అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చెయ్యాలని కొద్ది రోజుల తర్వాత సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అప్పటివరకు గృహనిర్బంధంలో ఉన్న వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసారు. అక్టోబర్‌లో రొమిల్లా థాపర్, తెల్తుంబ్డే దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

నవంబర్ 15 వ తారీఖున జరిగే ప్రపంచ తాత్విక దినోత్సవాన్ని(Philosophy Day) పురస్కరించుకుని పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ‘విమెన్ ఫిలాసఫర్స్’ (మహిళా తత్వవేత్తలు) జర్నల్ ‘ఇంటలెక్చ్యువల్స్, ఫిలాసఫర్స్, విమెన్ ఇన్ ఇండియా: ఎన్డేంజర్డ్ స్పిషీస్’ (‘మేధావులు, తత్వవేత్తలు, భారతదేశంలో మహిళలు: అంతరించిపోతున్న జాతులు’)అనే శీర్షికతో ఒక సంచిక విడుదల చేసింది. ఆ సందర్భంగా దృశ్య మాధ్యమం ద్వారా రొమిల్లా థాపర్ ‘అర్బన్ నక్సల్స్, భావ ప్రకటనా స్వేఛ్చ మరియు విశ్వవిద్యాలయాలు’ అనే అంశం మీద ఈ కింది సందేశం వినిపించారు.

దాని పూర్తి పాఠం కింద ఇస్తున్నాం.

ముందుగా భారతదేశంలో కొన్ని వర్గాలలో ఈ మధ్య కొత్తగా వచ్చి చేరిన ఒక తిట్టు గురించి చెబుతాను. ఈ రోజు మా దేశంలో ఉదారవాదులు, మేధావులపై ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేస్తున్నారు.

ఈ పదం పుట్టుక 1960 లలో మొదలయిన నక్సలైట్ ఉద్యమంతో ముడిపడి ఉంది. ఆనాడు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నుండి విడిపోయి బెంగాల్ ప్రాంతంలో రైతుల మధ్య పని చేసి ఆదివాసులను సంఘటిత పరిచినవారు నక్సలైట్లు. ప్రస్తుత సమాజాన్ని తాము అంగీకరించబోమనీ, దాన్ని కూలదోసి సామాజిక న్యాయం, పౌరుల  హక్కులకు పూర్తి భరోసా ఉన్న సమాజాన్ని పునర్నిర్మిస్తామని ఆ ఉద్యమకారులు పేర్కొన్నారు. కొంతకాలం తరువాత అ ఉద్యమం బెంగాల్ ప్రాంతంలో కనుమరుగు అయిపోయింది. కానీ కొద్ది కాలానికే మధ్య భారతదేశంలో పెద్ద స్థాయిలో మళ్ళీ ముందుకు వచ్చింది. ఆ ఉద్యమం కేవలం ఒక గ్రామీణ, ఆదివాసి ఉద్యమం; అందులో కొంతమంది విద్యార్దులు చేరారు, అంతే. అందువలన పట్టణవాసులకు దృష్టిలో  ‘అర్బన్ నక్సల్స్’ అనే పదమే విచిత్రమైనది.

ఇదంతా ఆకస్మికంగా ఒక రోజు మహారాష్ట్ర పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి, ‘వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు, మధ్య భారతదేశంలో రాజ్య వ్యతిరేక, తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న రహస్య నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నార’నే ఆరోపణల పర్వంతో మొదలయ్యింది. ప్రధానమంత్రిని చంపేందుకు కుట్ర పన్నుతున్నారు అనే ఒక కథనాన్ని కూడా వండి వార్చారు పోలీసులు. మేము కొంతమందిమి దానికి అసలు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాం. దురదృష్టవశాత్తు మా వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రోజున ఈ సామాజిక కార్యకర్తలందరూ కారాగారంలో ఉన్నారు. వారు న్యాయవాదులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు. మీలాంటి వారు, నాలాంటి వారు. ఈ మొత్తం ఘట్టంలో అత్యంత భయంకరమైనది ఏమిటంటే పోలీసులు కేవలం వాళ్ళ ఊహల ఆధారంగా మనలో ఎవరి ఇంటికైనా ఎప్పుడైనా సోదాకి వచ్చి మనకి ఎటువంటి సంబంధం లేని విషయాలపై అరెస్ట్ చేసే పరిస్థితి ఈ రోజు ఉందనేది.

ఈ అరెస్టులపై ఆందోళన వ్యక్తమైంది. కొంతమంది ఈ పరిణామాలకి సహజంగానే బాగా భయప

డ్డారు. కొంతమంది బహిరంగంగానే దీనికి తమ వ్యతిరేకత వ్యక్తం చెయ్యదలుచుకున్నారు. ఈ పరిణామం మేధావులకు, ఉదారవాదులకు, మరీ ముఖ్యంగా ఈ రోజు రాజ్యమేలుతున్న మత ఛాందసవాద రాజకీయ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వారికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ఐదుగురి తప్పు ఏమిటంటే, సామాజిక న్యాయానికి మద్దతుగా అణగారిన కులాల హక్కుల కోసం, దళితుల కోసం, ఈ సమాజం నుండి వెలికి గురయిన వారి కోసం  నిరంతరంగా పోరాడటమే. నిజానికి మానవహక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతున్న వీరు ప్రశంసాపాత్రులు. అలాంటి వారిపై ‘అర్బన్ నక్సలైట్ల’ ముద్ర వేసి దాడి చేస్తున్నారు.

మానవశాస్త్రాల మీద యుద్ధం

విశ్వవిద్యాలయాలపై, మరీ ముఖ్యంగా వాటిలోని  మానవ, సామాజిక శాస్త్ర విభాగాలపై, అక్కడ పని చేస్తున్న అధ్యాపకులపై నేడు నిరంతరంగా జరుగుతున్న దాడి మరొక ముఖ్యమైన విషయం. దీనికి కారణం అక్కడ చెబుతున్న పాఠాలు, చదవాల్సి వచ్చే పుస్తకాలు, రాస్తున్న పుస్తకాలు మితవాదులకు బొత్తిగా రుచించడం లేదు.

రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే అటువంటి పుస్తకాలను నిషేధించమని; లేకపోతే కనీసం వాటిని పాఠ్యాంశాల జాబితా నుండి తొలగించమని. ఈ డిమాండ్ ఎప్పుడూ కూడా ఎవరికీ పెద్దగా తెలియని సంస్థల నుండే వస్తుంది. అవి తమను తాము మత సంస్థలుగా చెప్పుకుంటాయి కాని నిజానికి అవి రాజకీయ సంస్థలు. ఆ డిమాండ్‌కు వాళ్ళు చెప్పే కారణం ఏమిటంటే ఈ పుస్తకాలు “కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి” అని. మొన్నీమధ్య వచ్చిన డిమాండ్ ఏమిటంటే దళిత మేధావి అయిన కంచ ఐలయ్య పుస్తకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయంవారి ‘చదవాల్సిన పుస్తకాల జాబితా’ నుండి తొలగించాలని. ఆ విశ్వవిద్యాలయం అధ్యాపక మండలి [AcademicCouncil -పాఠ్యాంశాల గురించి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండలి] ఈ డిమాండ్ కు తలొగ్గి, తొలగించడానికి చాలా వ్యతిరేకత ఉన్నా సరే ఒప్పుకుంది. ఆయన పుస్తకాలు తొలగించాలని అడగటానికి కారణం అవి హిందూ మత వ్యతిరేక పుస్తకాలట. అసలు ఏ ఒక్క సంస్థ అయినా సరే మొత్తం ‘హిందూ’ సమాజానికి ప్రతినిధిని అని ఎలా చెప్పుకుంటుంది? పైగా ఆ పుస్తకాలు ‘హిందూ మత వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి తొలగించాలి’ అని చెప్పి మొత్తం ‘హిందూ’ సమాజం అడుగుతోంది అని ఒక సంస్థ ఎలా అనగలుగుతుంది?

సామాజిక శాస్త్రాల మీద దాడి మరింత పకడ్బందీగా జరుగుతోంది. సామాజిక శాస్త్ర బోధనలో ఎంతో పేరున్న జవహర్ లాల్  నెహ్రు విశ్వవిద్యాలయం లాంటి విద్యాసంస్థలలో వీళ్ళు తీసుకువచ్చిన మార్పులు ఎలాంటివి అంటే ఆ విశ్వవిద్యాలయం నెలకొల్పిన కారణం, దాని పని వ్యవస్థ, నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఆ విశ్వవిద్యాలయానికి ఉన్న నాణ్యత ప్రమాణాలు అన్నీ పూర్తిగా ధ్వంసమయ్యేలా చేశాయి. ఈ మధ్యకాలంలో అధ్యాపకులుగా నియమితులయిన వారు జె.ఎన్.యు ప్రమాణాలకు ఏమాత్రం తూగేవారు కాదు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారం నియామకాలు జరపడమే దీనికి కారణం. ఇలా ప్రమాణాలు లేని వారిని నియమిస్తే వారిని తమ అదుపులో పెట్టుకోవటం మితవాదులకు చాలా తేలిక. విశ్వవిద్యాలయ ప్రమాణాలను ఈ విధంగా దిగజారిస్తే రాబోయే ఒకటి రెండు తరాలు పూర్తి నిరక్షరాస్యులుగా మిగిలిపోతారనేది నా భయం.

అసమ్మతి చావకూడదు

విశ్వవిద్యాలయం అంటేనే విద్యార్ధులకు ప్రశ్నించడాన్ని నేర్పటం, ప్రస్తుతం ఉన్న జ్ఞానాన్ని విమర్శించే విధంగా తర్ఫీదు ఇవ్వటం, ఈ విమర్శ ప్రక్రియ ద్వారా జ్ఞానాన్ని పెంపొందించడం. అటువంటి హక్కును కాలరాసి కేవలం ముందస్తుగా తయారుచేసుకున్న ప్రశ్నల రూపంలో ఉన్న సమాచారాన్ని అందించటం, అందులోనూ చదివే చదువుకి సంబంధం లేని సమాచారం అందించటం అంటే విద్యని అపహాస్యం చెయ్యటమే. దీనికి పరాకాష్ట ఏమిటంటే చరిత్ర, సాహిత్య విభాగాలలో సైతం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు తయారుచెయ్యడం.

మీరు అడగొచ్చు ఈ రోజు ఈ దాడి చరిత్ర విభాగాన్నే లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు జరుగుతోందని. గతం గురించి హేతుబద్దంగా, తార్కికంగా చేసే విశ్లేషణలను వ్యతిరేకించే వారు ఎవరంటే తమ భావజాల వ్యాప్తి కోసం ఒక ప్రత్యేక దృష్టికోణంలో భారతదేశ చరిత్రను అన్వయించే వారి దగ్గర శిక్షణ పొందిన వారు. వారి వాదన ఏమిటంటే చరిత్ర అనేది హిందూ నాగరికత గొప్పదనాన్ని చూపించాలి అని; భారతీయులు అంటే ప్రప్రధమంగా హిందువులు అని నిరూపించాలి అని. హిందూ మతంలో ఉన్న అసహనాన్ని గురించి గాని, లేక హిందువుల మధ్యనే జరిగిన గొడవలను గురించి గాని చెప్పే చరిత్రకారులు అంటే వారికి పడదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రకారం హిందువులు ఎప్పుడూ సహనశీలురు, అహింసావాదులు. కేవలం హైందవేతరులే హింసావాదులు , అసహనశీలురు.

వారు పట్టుకుని వేలాడే ఇంకొక నమ్మకం ఏమిటంటే హిందూ నాగరికత కానీ, హిందూ సంస్కృతి కానీ పూర్తిగా స్థానికం అని; ఈ నాగరికత నిర్మించిన వారు  భారతదేశం అనే ప్రదేశానికి చెందిన ప్రజల వారసులేనని. నిజానికి వారు చెప్పే భారతదేశానికి భౌగోళికంగా స్పష్టమైన సరిహద్దులు ఉండవు. కాస్త అటూఇటుగా  బ్రిటిష్ ఇండియాగా అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన డి.ఎన్.ఎ విశ్లేషణలు అన్నిటికన్నా ఎక్కువగా నిరూపించింది ఏమిటంటే హరప్పా కాలం నుండి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు మిశ్రమ సంతతికి చెందిన వారని. అంటే కొంతమంది స్థానికులు, మరికొంత మంది భారత ఉపఖండం బయట నుండి వచ్చినవారు అని. ఈ విశ్లేషణ వీరికి ఎనలేని దుఃఖం కలిగిస్తుంది.

తమ నమ్మకాలను వ్యతిరేకించే ఏ ఆలోచనా ధోరణిని కూడా వీరు సహించలేరు. ప్రాచీన భారతదేశ సంస్కృతికి ఈ ధోరణి వ్యతిరేకం.  ఆనాటి ఛాందసవాదులు కూడా ధిక్కార ఆలోచనా ధోరణిని హర్షించకపోయినా అ ధోరణి  ప్రబలంగానే ఉండేది. ప్రాచీన తత్వ సాంప్రదాయాన్ని గానీ, తత్వ చరిత్రని గానీ చూస్తే క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్ద కాలంలో రెండు ముఖ్య సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఒక సాంప్రదాయమేమో వేదబ్రాహ్మణ్య సాంప్రదాయం. ఇందులో ఆ వేదబ్రాహ్మణ్యంతో పూర్తిగా ఏకీభవించని ఉపనిషద్ ఆలోచనా ధోరణి కూడా కలిసి ఉంది. ఇంకొక సాంప్రదాయం ఈ వేదబ్రాహ్మణ్య సాంప్రదాయానికి విరుద్ధమైన శ్రమణుల ఆలోచనా ధోరణి. దీన్ని ముందుకి తెచ్చిన వారు వేదబ్రాహ్మణ్య సాంప్రదాయాన్ని వ్యతిరేకించిన బౌద్ధులు, జైనులు, అజ్వికులు, చార్వాకులు. వేదబ్రాహ్మణ్యం వారిపై ‘నాస్తికులు’ లేదా అవిశ్వాసులు  అని ముద్ర వేసి వారిని వ్యతిరేకించింది. ఇక్కడ అందరం ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే వేదబ్రాహ్మణ్య సాంప్రదాయాన్ని ధిక్కరించిన ఒక శక్తివంతమైన సంస్కృతి ఆ రోజుల్లో ఉన్నదని. కాకపోతే ప్రాచీన భారత దేశ చరిత్ర గురించి వచ్చిన రచనల్లో బ్రాహ్మణ్య సాంప్రదాయం గురించే ఎక్కువ ఉంది.

వేదబ్రాహ్మణ్య సాంప్రదాయాన్ని ప్రశ్నించటంతో మొదలయిన ప్రయాణం తర్వాత కాలంలో ఎన్నో కొత్త ఆలోచనలకు, విభిన్న తాత్విక ధోరణులకు దారి తీసింది. ఈ రోజు భారత దేశ సామాజిక జీవనానికి ఎటువంటి ముప్పు వాటిల్లుతుందో అనే భయం ప్రధానంగా విద్యావ్యవస్థను వారు నాశనం చేస్తున్న తీరు వల్ల కలుగుతోంది. కేవలం ఎటువంటి అధ్యాపకులను నియమిస్తున్నారు అనే దాని నుండే కాక ఎటువంటి పాఠ్యాంశాలు భోదిస్తున్నారు అనే దాని నుండి కూడా ఈ భయం ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర పాఠ్యపుస్తకాల తిరగరాత కార్యక్రమం చాలా ఆందోళనకు గురిచేసే విషయం. చరిత్రలోని కొన్ని కాలాలకు కాలాలనే పాఠ్యపుస్తకాల నుండి తొలగిస్తున్నారు లేదా వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే అవి నేడు అధికారంలో ఉన్నవారికి ఏమాత్రం రుచించేవి కాకపోవటం వలన. ఇది చాలా తీవ్రమైన విషయం.

ఈ పరిస్థితుల్లో మన బోటి ఉదారవాదులం అసమ్మతిని వ్యక్తం చేసే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి జారనివ్వకూడదు.

 

author avatar
Siva Prasad

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Leave a Comment