పునరాలోచనలో సబిత

 

హైదరాబాదు, మార్చి 12: కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డ మల్లేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాన్ని ఆపేందుకు స్వయంగా యుపిఎ చైర్‌పర్సన్ సోనియో గాంధీ రంగంలో దిగినట్లు సమాచారం.

తెలంగాణలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ తీవ్ర గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క తదితర సీనియర్ నేతలు పార్టీని వీడి బయటకు వెళుతున్న వారిని నిలువరించలేకపోతున్నారు.

సబితా ఇంద్రారెడ్డి సైతం టిఆర్ఎస్‌లో చేర్పించేందుకు మొగ్గు చూపారు. ఆమె కుమారుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

రెండు రోజుల క్రితం ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి మధ్యవర్థిత్వంలో సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం టిఆర్ఎస్ ఎంపి కవితను కలిసి చర్చించారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి కూడా కారెక్కడం ఖాయమని భావించారు. ఉత్తమ్, భట్టి విక్రమార్క ఆమెను కలిసి చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

ఈ నేపథ్యంలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేరుగా సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సోనియా సూచించినట్లు సమాచారం.

సోనియా సూచనలపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిలు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ‌ సోనియా గాంధీ మాట్లాడిన తరువాత సబిత పార్టీని వీడే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.