కొత్త టెన్ష‌న్‌… మ‌న ద‌గ్గ‌ర కరోనా థ‌ర్డ్ వేవ్?

దాదాపు ఏడు నెల‌లుగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ తాజాగా కొత్త టెన్ష‌న్‌ను తెర‌మీద‌కు తెచ్చింది. గ‌త కొద్దికాలంగా క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ కేసులు త‌గ్గుతున్నా.. రాజ‌ధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఢిల్లీలో ఒక్క‌సారిగా మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 5673 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మూడ‌వ ద‌ఫా వైర‌స్ కేసుల విజృంభ‌ణ మొద‌లైందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఆ భ‌యం వ‌ద్ద‌ట‌

గ‌త వారం నుంచి ఢిల్లీలో వ‌రుస‌గా 4వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. సోమ‌వారం 4853 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆ త‌ర్వాత రెండు రోజులకు మ‌ళ్లీ ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఢిల్లీలో బుధవారం ఒకే రోజు 5,673 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 40 మరణాలు నమోదయ్యాయి. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర‌ జైన్ స్పందించారు. అక‌స్మాత్తుగా కేసులు పెర‌గ‌డం అనూహ్యం ఏమీ కాద‌ని జైన్ తెలిపారు. పండుగ‌ల సీజ‌న్ మొద‌లైంద‌ని, దాంతో పాటు చ‌లి కూడా పెరిగింద‌ని, ఈ నేప‌థ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. అయితే ఈ ట్రెండ్‌ను ఓ వారం రోజుల పాటు ప‌రిశీలించాల‌ని ఆయ‌న అన్నారు. క‌చ్చితంగా ఏమీ చెప్ప‌లేమ‌ని, అయితే కేసుల విజృంభ‌ణ‌ను థర్డ్ వేవ్‌గా అప్పుడే పిలువ‌లేమ‌ని, కానీ మూడ‌వ ద‌ఫా ప్ర‌భావం ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జైన్ అన్నారు.

ప్లాన్ మారింది

పెద్ద ఎత్తున పాజిటివ్ కేసుల న‌మోదు నేప‌థ్యంలో కొవిడ్‌-19 పరీక్షల వ్యూహాన్ని ఢిల్లీ సర్కారు మార్చింది. పాజిటివ్‌ రోగుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పరీక్షలు చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. హాస్పిటళ్లలో పదివేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి. పండుగలు, శీతాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాన్ని మార్చామని సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు. కుటుంబీకులను, రోగుల సన్నిహిత పరిచయస్తులను పరీక్షిస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ ప్రక్రియ ఇప్పుడు మరింత బలంగా మారాయని, దూకుడుగా ప్రత్యేక వ్యక్తులను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రతి కేసును గుర్తించడమే మా లక్ష్యమని, త్వరలోనే ఫలితాలు చూస్తామని చెప్పారు. ఒక‌వేళ ఇంట్లో ఎవ‌రికైనా పాజిటివ్ వ‌స్తే, ఇక నుంచి ఆ ఇంటి స‌భ్యులంద‌ర్నీ టెస్ట్ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. 5 రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.