15,000 కోట్ల ఆదాయం క‌రోనా టైంలో కేసీఆర్ పెద్ద ప్లాన్‌…రంగంలోకి ఇంటెలిజెన్స్‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల్లో ఇటీవ‌ల‌ హాట్ టాపిక్‌గా మారిన అంశం ఎల్ఆర్ఎస్‌. రెగ్యులరైజ్ కాని ప్రతి ప్లాట్ను ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పరిధిలోకి తీసుకురావాలని, త‌ద్వారా వాటికి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌వ‌చ్చున‌ని ప్ర‌భుత్వం చెప్తోంది.

అయితే, దీని వెను భారీ ఆదాయం ఎత్తుగ‌డ ఉందంటున్నారు. ఆర్థికంగా క‌ట‌క‌ట నిధుల స‌మ‌స్య ఉన్నందున రూ.15,000 కోట్లు స‌మీక‌రించే ఆలోచ‌న ఉంద‌ని స‌మాచారం.

భారీ ఎత్తున ఆదాయం

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారం ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగే నాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 6 శాతం రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించాలి. వెంచర్లో ఖాళీ స్థలం లేకపోతే అదనంగా 14 శాతం ఫీజు చెల్లించాలి. దీంతో ఒక్కో దరఖాస్తుదారుడు సగటున రూ. 60 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఒక అంచ‌నా. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్నిపల్ కార్పొరేషన్లు, కొత్త జిల్లా కేంద్రాల పరిసరాల్లో వెలిసిన వెంచర్ల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని అంచ‌నా. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయ్యి, రెగ్యులరైజ్ కాని ప్లాట్లు 27 లక్షల వరకు ఉంటాయని, వీటిలో దాదాపు 22 లక్షల ప్లాట్లకు ఇప్పటికే అప్లికేషన్లు వచ్చాయని పేర్కొంటున్నారు. ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కోసం ఒక్కో అప్లికేషన్కు సగటున రూ. 60 వేల ఫీజు భారం పడే చాన్స్ ఉందట‌. ఈ ప్ర‌కారం రూ.15,000 కోట్ల ఆదాయం రానుంద‌ని అంటున్నారు.

గ్రామాల నుంచే ఆదాయం…

గ్రామ పంచాయితీల నుంచే ఎల్ఆర్ఎస్ కోసం ఎక్కువ మొత్తంలో అప్లికేషన్లు వస్తున్నాయని స‌మ‌చారం. గడువు ముగిసేనాటికి పది లక్షల అప్లికేషన్లు కేవలం గ్రామ పంచాయితీల నుంచే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో పెద్ద ఎత్తున అక్రమ వెంచర్లు వెలిశాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తుందన్న ఆశతో ప్రతి ప్లాట్ కు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అనుమతి లేని వెంచర్లలో ప్లాట్ కొనుగోలుకు ప్రజల నుంచి వేల కోట్లలో ప్రభుత్వం ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది.

ప్ర‌జ‌లు ఫీల‌వుతున్నార‌ట‌

కాగా, ప్రభుత్వం నిర్ణయించిన ఎల్ఆర్ఎస్ ఫీజుపై ప్ర‌తిప‌క్షాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసినప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం ప్లాట్ కొనుగోలుదారులపై భారం వేయడం ఏమిటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఫీజుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఫీజు తగ్గింపుపై ఆలోచిస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.