చంద్రబాబు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? టీడీపీ ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తోంది? వీటికి జవాబులు చెప్పాలంటే చాంతాడంత జాబితా ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మంచి పనులతోపాటు మాటలు మార్చి తప్పు మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేక, పార్టీ శ్రేణులను చైతన్యపరచలేక పోతూ ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలుగా నాయకుల ఎంపిక, జిల్లాస్థాయిలో నాయకత్వాన్ని కాపాడుకోలేకపోవడం.. పార్టీ భవిష్యత్తును శాసిస్తున్నాయి.
చంద్రబాబువి ఊకదంపుడు ఉపన్యాసాలేనా..
చంద్రబాబును నమ్మలేం..! సుదీర్ఘ రాజకీయంలో ఆయనను చూసిన వారు చెప్పే మాట. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి రాగానే మరొకలా మాట్లాడటం బాబుకి ఇరవై ఏళ్లుగా అలవాటైన విషయమే. అధికారంలో ఉండగా పార్టీని పట్టించుకోవడం లేదని నాయకులు, కార్యకర్తలు లోలోపలే రగిలిపోయేవారు. మహానాడు, పార్టీ కార్యక్రమాల సమయంలో వారు తమ ఆవేదన చెప్పుకునేవారు. వారికి.. పార్టీ మీకు అండగా ఉంటుంది.. నేనున్నాను మీకు భయం లేదు.. అనటమే కాని.. పట్టించుకున్న దాఖలాలు వేవని పార్టీ నాయకులే అంటారు. చంద్రబాబు చెప్పే మాటలను అందరూ వినాల్సిందే. కానీ.. విని ఎంతమంది పాటిస్తున్నారనేదే ఇక్కడ విషయం. అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్నే ఆయన టెలీ కాన్ఫరెన్స్ వినని వాళ్లే ఎక్కువని.. ఆ ఉపన్యాసాలు వద్దని పార్టీలోని పెద్ద తలకాయలే బాహాటంగా చెప్పాయి. దీనిని అధికారంలో ఉండగా చంద్రబాబు మానలేదు.. అధికారం పోయాక మారనూ లేదు. ఆయన చెప్తారు.
చంద్రబాబు మాటలు వినని, నమ్మని వారే ఎక్కువా..
అధికారంలో ఉండగా పార్టీని పట్టించుకోలేదు. ఇకపై మీకోసం పని చేస్తాను. మళ్లీ అధికారంలోకి వచ్చేలా మనం పని చేయాలి. అంటూ రొటీన్ డైలుగుల్నే అనంతపురం నాయకులతో పేల్చారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినవే ఇవి.. అధికారంలోకి రాగానే పట్టించుకోనివీ.. ఇవే. యువతకు ప్రాధాన్యం ఇస్తాం అనేది బాబు చెప్పే పరమ అబద్దమైన మాట అని.. వారితో పని చేయించుకుని తన పాత బ్యాచ్ లోనే వయసుమళ్లిన వారికి టికెట్లు, పదవులు ఇస్తారని ఓ వాదన. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని.. మధ్యలో వచ్చిన వారిని నెత్తికెక్కించుకుంటారని బాబుకు పేరు. ఇవన్నీ చూసిన టీడీపీ శ్రేణులు.. బాబుని నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. తెలంగాణలో పార్టీ ఉనికి పోవడానికి కారణం కూడా చంద్రబాబు మాటలపై నమ్మకం పోవడమే అని అంటారు. ఇవి చంద్రబాబు చేసే తప్పులు కావు.. ‘చంద్రబాబు రొటీన్ పొలిటికల్ స్ట్రాటజీ’ అనుకోవాలేమో.