‘ఈ వివక్షత ఎందుకు!?’

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని సమర్థించడం అన్యాయమా అని గిరి ప్రశ్నించారు. పార్టీ అధినేతగా తమరి సహకారం లేకపోయినా, సొంత పార్టీ వారి నుండే సమస్యలు ఎదురైనా ఆరేళ్లుగా ఎన్నో కష్టాలను ఎదురొడ్డి పార్టీనే నమ్ముకుని పని చేశానని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను శిరసావహిస్తూ పని చేస్తున్నా, ముఖ్యమంత్రిని కలవడం వెనుక ఉన్న కారణాల కూడా తెలుసుకోకుండా, కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సిఎంను కలిసిన 12 గంటల లోపే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా మరొకరిని నియమించడంలో ఆంతర్యమేమిటని గిరి ప్రశ్నించారు.

పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికే మాత్రమే పెద్దపీట వేస్తారా అని ప్రశ్నించారు.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఇలానే చేశారా, అలాగే బాపట్ల, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇన్‌చార్జిలను నియమించారా అని చంద్రబాబును గిరి  ప్రశ్నించారు. ఆ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను నియమించకుండా తన విషయంలో మాత్రం వేగంగా అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో గల మతలబు ఏమిటని ప్రశ్నించారు. పార్టీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యతను ఇవ్వడం చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోందని గిరి అన్నారు.

విశాఖకు చెందిన నలుగురు టిడిపి సభ్యులు అమరావతి రాజధానిగా వ్యతిరేకించి విశాఖ రాజధానిగా చేయడాన్ని సమర్థించినప్పుడు వారిపై  ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. తనపై ఈ నిర్ణయం తీసుకోవడాన్ని  చంద్రబాబు విజ్ఞతకే వదిలివేస్తున్నానని గిరి పేర్కొన్నారు.