తెలంగాణలో పోటీ చేసే దమ్ముందా?

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ దాడిని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, కాబట్టే మీ మడమ తిప్పే నేత వెన్నులో వణుకు మొదలైందంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘విలువలు, విశ్వసనీయత అని డబ్బా కబుర్లు చెప్పారు, దేవుడు స్క్రీప్ట్ బాగా రాశాడు అని బీరాలు పలికినారు ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేను పార్టీలో చేరమని ప్రాధేయపడుతున్నాడు’ అని పేర్కొన్నారు.

‘తెలంగాణలో టిడిపికి 1800 ఓట్లు వచ్చాయి అని ఎద్దేవా చేస్తున్నావ్. అసలు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే దమ్ము కూడా లేని నాయకుడు వైఎస్ జగన్ అధినేతగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి సిగ్గుగా లేదా విజయసాయిరెడ్డి గారు!! తనమీద ఉన్న కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లడానికి కోట్లు పోసి ప్రత్యేక విమానాలు, 25 కోట్లతో క్యాంపు ఆఫీస్ కి సోకులు, పక్క రాష్ట్రంలో ఉన్న ఇంటికి హంగులు.. మీ సాక్షి పరివారాన్ని మేపడానికి 150 కోట్లు, ఆఖరికి నాసిరకం బియ్యం పంపిణీకి నాణ్యమైన సంచుల పేరుతో మీ కంపెనీకి 750 కోట్ల ఆర్డర్. పనికిమాలిన సలహాల పేరుతో రోజుకో పదవి సృష్టించి ఒక్కొక్కరికీ నెలకు లక్షల్లో జీతాలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది అంటూనే మీ వైఎస్ జగన్ గారు ప్రజా ధనాన్ని సాంతం నాకేస్తున్నారు కదా విజయసాయి రెడ్డి గారు!!’ అని ట్వీట్ చేశారు.