‘గోరంత చేసి కొండంత ప్రచారం!’

అమరావతి:  అగ్రిగోల్డ్ బాధితులకు గోరంత చేసి కొండంతగా ప్రభుత్వం చెప్పుకొంటోందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  అగ్రిగోల్డ్ బాధితులకు గత టిడిపి ప్రభుత్వం 350 కోట్లు విడుదల‌ చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చి అంతా తమ ఘనతగా చెప్పుకుంటున్నారని బుద్దా విమర్శించారు. వైసిపి కార్యకర్తలుగా ఉన్నవారికే ఆ డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడింది టిడిపి ప్రభుత్వమేనని బుద్ద అన్నారు. హాయ్ ల్యాండ్‌ను నారా లోకేష్ కబ్జా చేశారని ప్రచారం చేశారనీ, ఇప్పుడు అది ఎవరి ఆధ్వర్యంలో ఉందనీ ఆయన ప్రశ్నించారు. అది‌ నిజమైతే చర్యలు ఎందుకు తీసుకోలేదని బుద్దా అడిగారు.

ఐదు నెలల‌ వైసిపి ప్రభుత్వ పాలనలో అన్ని‌వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో ఎటువంటి కట్టడాలు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బుద్దా అన్నారు. ఇసుక కొరత వల్ల కార్మికులు  ఆత్మహత్యలు‌ చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన 24 గంటల్లో 447 జివోను విడుదల‌ చేశారని ఆయన అన్నారు.

ప్రాణ భీతి ఉన్నవాడు పులిపిరి కాయ చూసి కూడా భయపడతాడనీ, ప్రాణ భయం లేనివాడు అణు‌ బాంబును చూసి కూడా భయపడడనీ, ఉడత బెదిరింపులకు భయపడే మనస్థత్వం తనది కాదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు భక్తుడిగా ఆయనకే తన జీవితం అంకితమని బుద్దా అన్నారు.  సమావేశంలో టిడిపి ఎన్ఆర్ఐ బుద్దా రాంప్రసాద్ గారు పాల్గొన్నారు.