రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

47 views

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించారు. తాజాగా, కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులను ఖరారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమైన చంద్రబాబు.. మొదట రాజంపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును ప్రకటించారు.

ఆ తర్వాత పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డి, రైల్వే కోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ పేర్లను చంద్రబాబు ఈ సమావేశంలో ఖరారు చేశారు.

అయితే, తంబళ్లపల్లి అభ్యర్థి విషయంలో ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ ఉన్నారు. ఇక మిగితా అభ్యర్థుల విషయంలో వారంలోపు నిర్ణయం తీసుకుంటామని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సర్వేల ఫలితాలు, స్థానిక పరిస్థితులు, రాజకీయ, సామాజిక అవసరాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తున్నారు.

కడప పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల నేతలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. మైదుకూరు టికెట్ తనకు కేటాయించాలని ఇప్పటికే మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి చంద్రబాబును కలిశారు. అయితే, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఇదే సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కడప పార్లమెంటు నియోజకవర్గం నేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు నుంచి సీట్ల కేటాయింపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.