‘రాష్ట్రం బావుండాలంటే టిడిపి గెలవాలి’

 

అమరావతి,జనవరి2: ఇది ఎన్నికల సంవత్సరమని, ప్రతి తెలుగుదేశం నేత, కార్యకర్త, వచ్చే నాలుగైదు నెలలూ విజయం కోసం కష్టపడి శ్రమించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రారంభమైన “ జన్మభూమి-మా ఊరు” కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. ఈ పది రోజులూ నాయకులు గ్రామాలు,వార్డుల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.

ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌కు కీలకమని, భావితరాల భవిష్యత్తు రానున్న ఎన్నికల పైనే ఆధారపడివుందని పేర్కోన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోవడం కుదురుతుందనీ, ఈ విషయాన్ని సవివరంగా ప్రజలకు తెలియజేయాలని నేతలకు సూచించారు. టీడీపీ గెలవకుంటే రాష్ట్రం చాలా కష్టాల్లోకి కూరుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.