‘కన్నా’ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా – ఉద్రిక్తత

గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి దిగారు. మోదీ, కన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపధ్యంలో బీజెపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందోళనకు దిగి ‘కన్నా’కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలు, కార్యకర్తల వాగ్వివాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో టీడీపీ, బీజెపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదంతో పాటు తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో తెలుగుదేశం కార్యకర్తలపై బీజెపీ కార్యకర్తలు దాడి చేసి తరిమికొట్టారు.