17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్  స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ ఏడున ఎననికల ఫలితాలు వెలువడిన అనంతరం, కెసీఆర్ 13వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. నాడు కెసీఆర్‌తో పాటు డిప్యూటి సీఎంగా మహమూద్ ఆలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు.

ఫలితాలు వెలువడి నెల కావస్తున్నప్పటికీ ఇంతవరకూ తెలంగాణలో అటు మంత్రివర్గం ఏర్పాటు కానీ, ఇటు శాసనసభ సమావేశాలను నిర్వహించడం కానీ జరగలేదు. రెండవ సారి ముఖ్యమంత్రి కాగానే కెసిఆర్ కేంద్రంలో బీజెపీయేతర, కాంగ్రేసేతర ప్రత్యామ్నాయం కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానంటూ ఒదిషా,  పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలకు పయనమయ్యారు. చివరికి శాసనసభ సమావేశాలకు ముహూర్తం కుదిరింది.

మొదటి నుంచీ ముస్లింల మద్దతు కోసం మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న కెసిఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారితో కలిసి నడిచారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే  ప్రోటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేశారు. ఆయన ఈ నెల 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అసెంబ్లీ కార్యక్రమాలు ఈ నెల 17వ తేదీన ప్రారంభం అయి నెలాఖరు వరకూ జరుగుతాయి. 17న ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన శాసనసభ సమావేశమవుతుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తదుపరి స్పీకర్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు జరుగుతాయి. 18న స్పీకర్ ఎన్నిక తరువాత ఆయన అధ్యక్షతన సభా కార్యక్రమాలు జరుగుతాయి. 19న శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు.