ఆర్ఆర్ఆర్ వివాదం..! రాజమౌళిపై బండి సంజయ్ ఫైర్..!!

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

సినీ దర్శకుడు రాజమౌళిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్. సహజంగా దర్శకుడు రాజమౌళి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్ టి ఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడు రిలైజ్ అవ్వడం ఆలస్యం ఆర్ ఆర్ ఆర్ సినిమా వివాదాల్లో చిక్కుకున్నది. ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఇలా వివాదం వస్తుందని రాజమౌళి భావించలేదు. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు. దానిలో ఎన్టీఆర్ ముస్లిం మతస్తులు పెట్టుకునే టోపీ పెట్టుకుని కనబడటం ప్రస్తుత వివాదానికి కారణం అయ్యింది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు రాజమౌళికి హెచ్చరికలు ఇచ్చిన విషయం విదితమే. వీటిపై రాజమౌళి ఇంత వరకూ స్పందించలేదు.

తాజాగా ఈ వివాదంపై దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ స్పందిస్తూ రాజమౌళిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బిడ్డా రాజమౌళి.. కొమరం భీమ్‌ను కించపరుస్తూ సినిమా తీస్తావా ? నీకు గుణపాఠం తప్పదు అంటూ హెచ్చరించారు. “మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినవు. నిజంగా దమ్ముంటే ఓల్డ్ సిటీ ముస్లింకి కాషాయం కండువా వేసి సినిమా తీయ్. మేం చూస్తం, నువ్వు గనుక ఆ సినిమా రిలీజ్ చేస్తే బరిగలతో కొట్టి చంపుతాం” అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.