దేవ‌ర‌గ‌ట్టులో టెన్ష‌న్‌… లాక్ డౌన్‌, 144 సెక్ష‌న్‌.. ఏం జ‌ర‌గ‌నుంది?

దేవ‌ర‌గ‌ట్టు… కర్నూలు జిల్లాలోని ఈ ఊరి పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు.

 

ఉత్సవమే అయినప్పటికీ కొట్లాటలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి దేవరగట్టు చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతుంటాయి. కర్రలతో యుద్ధం చేసుకుంటారు. తలలు పగలడం…రక్తం ఏరులై పారుతుంది. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాన్ని రద్దు చేశారు.

144 సెక్ష‌న్‌…

బన్నీ ఉత్సవం నేప‌థ్యంలో కొండపై ఉన్న దేవాలయంలో కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయని, ఉత్సవం జరగదని పోలీసులు చెప్తున్నారు. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయం ప్రకారం బన్నీ ఉత్సవం నిర్వహించి తీరుతామని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో దేవరగట్టులో రెండు రోజులపాటు లాక్ డౌన్ విధిస్తు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. వెయ్యి మంది పోలీసులతో ఆ గ్రామంలో అడుగడుగునా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. బయట గ్రామాల నుంచి ఎవర్ని దేవరగట్టులోకి అనుమతించడం లేదు.

గ‌త ఏడాది ఏం జ‌రిగిందంటే….

ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. దాదాపు 1000 మంది పోలీసులు పహారాలో ఈ ఉత్సవం జరిగింది. ప్ర‌తి ఏడాదిలాగానే ఇలవేల్పును దక్కించుకోవడం కోసం అక్కడి గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉత్సవంలో పాల్గొన్న గ్రామస్తులు మద్యం సేవించి కర్రలతో ఫైట్ చేసుకున్నారు. ఈ కొట్లాటలో దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.