టీటీడీ డిక్లరేషన్ ఇక ముగిసిన అధ్యాయం. సీఎం జగన్ ‘తిరుమల వెళ్తారు.. దర్శనం చేసుకుని వస్తారు. డిక్లరేషన్ ఇవ్వరు.. గతంలో ఇవ్వలేదు.. ఇకపై ఇవ్వబోరు’. దీనికి స్పష్టమైన సంకేతాలే డిక్లరేషన్ వివాదం. ఒక ప్రణాళిక ప్రకారం వివాదాన్న తెరపైకి తెచ్చి.. అంతే ప్రణాళికతో వివాదం ముగించి, దారి మళ్లించి సక్సెస్ చేసుకోవడంలో అందరూ సఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఇందులో వైసీపీ ప్రభుత్వం నుంచి టీటీడీ చైర్మన్ వరకూ అందరూ ఒక ప్రణాళికతో వెళ్లారని చెప్పాలి. అసలు ఈ అంశం ఎలా తెరపైకి వచ్చిందని చూస్తే..

జగన్ కు ఇష్టం లేదు.. అలాగని వ్యతిరేకం కూడా కాదు..
జగన్ పక్కా క్రిష్టియన్. అలాగని హిందూ వ్యతిరేకి కాదు. యాగాలు, పుష్కర స్నానం, శారదా పీఠం సందర్శన.. ఇలా హిందూ సంప్రదయాలు, ఆచారాలు గౌరవిస్తారు. ఇటువంటి వ్యక్తి అన్ని మతాలను సమంగానే చూస్తారు. తన మతాన్ని చిన్నబుచ్చుకోకుండా.. పరమతాల్ని తక్కువ చేయకూడదు. వీటన్నింటినీ సమంగా చేస్తూ వస్తున్నారు. జగన్ కు టీటీడీ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. ఈక్రమంలోనే తన వాయిస్ ను వైవీ సుబ్బారెడ్డి ద్వారా చెప్పించి ఓ వివాదాన్ని సృష్టించి, తర్వాత దారి మళ్లించి, మంత్రి కొడాలి నానిని పావుగా ప్రయోగించి సింపుల్ గా ముగించేశారు.
జగన్ వెళ్లారు.. వచ్చారు.. జరుగుతున్నదేమిటి..
సీఎం జగన్ అనుకున్నదే చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లారు.. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? డిక్లరేషన్ చిన్నదై కొడాని నాని వ్యాఖ్యలు పెద్దవైపోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన.. కలిసి నానిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఒక వివాదాన్ని తీసుకొచ్చి దానిని చివరి దశలో దారిమళ్లించి తమ పనిని చక్కబెట్టుకున్నారు. నిజానికి డిక్లరేషన్ సీఎంకు పెద్ద విషయం కాదు. ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం. ఇంత రాజకీయం చేసుకోవాల్సిన అంశమూ కాదు. కానీ.. ఆయన నేరుగా వెళ్లి డిక్లరేషన్ ఇవ్వకుండా నేరుగా దర్శనం చేసుకుని వస్తే అయ్యే రాజకీయం కంటే.. ముందే చర్చనీయాంశం చేసుకుని సఫలీకృతం అయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని టార్గెట్ అయినా.. ఇది కూడా రెండు, మూడు రోజుల్లో చప్పబడిపోవడం ఖాయమే.