ఆ పదవి మాకొద్దు దొరా !

హైదరాబాదు, డిసెంబర్ 27: రెండవ సారి కొలువు తీరిన టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎవరు స్పీకర్ పదవి చేపట్టనున్నారు. ఈ నెల 13న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు డిప్యూటి సీఎంగా మహమూద్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నికతో పాటు మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం చేయకుండానే, కెసిఆర్ దేశంలో బీజేపీయేతర, కాంగ్రేసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ కూర్పులో భాగంగా వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టడానికి బయలుదేరి వెళ్ళారు. తొలుత ఒడిసాలో సీఎం నవీన్ పట్నాయక్, తరువాత బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీని కలిసిన కెసీఆర్ బుధవారం (డిసెంబర్ 26న) ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఎలక్షన్ కమీషన్ అధికారులను, కేంద్ర మంత్రులను కలిసి హైదరాబాదుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆయన తిరిగి రాగానే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు.

 

ఈ నేపధ్యంలో  అసెంబ్లీ స్పీకర్ ఎవరు అవుతారన్న ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీలో స్పీకర్ గా పని చేసిన మధుసూధనాచారి పరాజయం పాలైయ్యారు.  అప్పడు డిప్యూటి స్పీకర్‌గా బాధ్యతలు చూసిన పద్మా దేవేందర్‌కు స్పీకర్‌‌గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌తో సహా ఇప్పడు కూడా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వారు తరువాత వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలవుతున్న విషయం తెలిసిందే.  సురేష్ రెడ్డి, నాదేండ్ల మనోహర్ వంటి వారు సైతం స్వీకర్ పదవులు చేసిన తరువాత పరాజయం పాలైయ్యారు. ఈ నెగిటివ్ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ పదవి తీసుకునేందుకు ఎమ్మెల్యేలు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. ప్రస్తుతం ప్రొటైమ్ స్పీకర్‌తో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసినా అనంతరం సభ్యుల నుండి స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పదవిపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు విముఖత చూపుతున్నట్లు సమాచారం.