చింతమనేని X అబ్బయ్య వద్దు..! కొత్త “కమ్మ” కావాల్సిందే..!! గ్రౌండ్ రిపోర్ట్

ఒకరికి ఒళ్ళంతా అహం..! మరొకరికి మాటలు తప్ప, పనితనం తెలీదు..!!
ఒకరికి నోటి దురుసు..! మరొకరికి అప్పుడే మరకలు..!! అందుకే మాకొద్దు బాబోయ్ ఈ నాయకులు, మాకో కొత్త “కమ్మో”రు కావాల్సిందే అంటున్నారు ఆ నియోజకవర్గంలో..! పశ్చిమ గోదావరిలో.., ఓ రకంగా రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గం పాత్ర ప్రత్యేకమైనది..!! అక్కడ ఇప్పుడు నాయకత్వ కొరత ఏర్పడింది. అదేంటి ఎమ్మెల్యే ఉన్నారు కదా.. “అబ్బయ్య చౌదరి” యువకుడు, విద్యావంతుడు ఉన్నాడు కదా.., లోటు ఏంటి..? అనుకుంటున్నారేమో..! అందుకే లోతుగా వెళ్లి “దెందులూరు గ్రౌండ్ రిపోర్ట్” చూద్దాం పదండి..!!

కమ్మ వారికి ప్రత్యేకత ఎందుకంటే..!!

పేరుకే బీసీ ఓటర్లు అధికం. కానీ ఒళ్ళంతా కమ్మదనం నిండిన ఈ నియోజకవర్గం తీర్పు మిశ్రమంగా ఉంటుంది. ఏ మాత్రం తోక జాడించినా కట్ చేయడం ఇక్కడి ఓటర్లకు బాగా అలవాటు. దెందులూరు నియోజకవర్గంలో 2.20 లక్షల ఓటర్లు ఉండగా.., బీసీలు 65 వేలు ఉంటారు. ఎస్సిలు సుమారుగా 60 వేలు, కమ్మ సామజిక వర్గం సుమారుగా 40 వేలు, కాపు ఓటర్లు దాదాపు 35 వేలు, రెడ్డి 10 వేలు ఉంటారు. కానీ మొదటి నుండి కమ్మ సామాజికవర్గానిదే పెత్తనం. ఏ పార్టీ గెలిచినా ఆ అభ్యర్థులదే విజయం. 1955 లో మూల్పూరి రంగయ్య మొదలుకుని.., 2019 లో అబ్బయ్య చౌదరి వరకు అందరూ అదే సామాజికవర్గం. మధ్యలో 1978 లో ఒకేసారి ఇందిరాగాంధీ హవాలో కాంగ్రెస్ పార్టీ తరపున నీలం చార్లెస్ గెలిచారు. మిగిలిన 14 ఎన్నికల్లోనూ కమ్మ వాళ్లదే విజయం. ఇక్కడ గ్రామాల్లో కమ్మ సామాజికవర్గం నేతలదే హవా. మొదటి నుండి పెత్తనం అలా అలవాటయింది. అందుకే నియోజకవర్గస్థాయిలో కూడా వాళ్లదే చక్రం. ఇప్పుడు కూడా ఆ కమ్మ నేతలకే కష్టం వచ్చి పడింది. తమను శాసించే నాయకుడు సరిగా ఉండట్లేదు అంటూ రెండు పార్టీల్లోనూ తలలు పట్టుకుంటున్నారు.

 

చింతమనేని X అబ్బయ్య..! నో యూజ్..!!

చింతమనేని ప్రభాకర్ వరుసగా రెండు సార్లు గెలిచారు. మొదటిసారి గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉంటూ బాగా కష్టపడిన ఆయన, రెండోసారి గెలిచాక గీటు దాటారు. మాట, ప్రవర్తన విపరీతం అయ్యి, సొంత మనుషులకు దూరమయ్యారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే ఆయనపై సొంత సామాజికవర్గంలో అసంతృప్తి మొదలయింది. ద్వితీయశ్రేణి, మండలస్థాయి నేతలు చాటుమాటుగా కలుసుకుంటూ.., “ఎమ్మెల్యేని పార్టీ అదుపు చేయకుంటే/ ఆయన తగ్గకుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించేద్దామ్” అంటూ 2016 నుండి ప్రణాళికలు వేశారు. అలా అలా ప్రభాకర్ కి సొంత మనుషులు చాలా మంది దూరమయ్యారు. 2019 లో విపరీత నమ్మకంతో బరిలోకి దిగిన ఆయన ఓటమితో కొంచెం దిగులు చెందినా ఇప్పటికీ మార్పు లేదనేది టీడీపీ వర్గీయుల మాట. పార్టీపై, ఆయనపై అభిమానంతో ఉంటున్న కొందరు బయటపడలేక లోలోపల మధన పడుతున్నారు.

* అబ్బయ్య చౌదరి బాగా చదువుకున్నారు, లండన్ లో మాంచి జబ వదులుకుని వచ్చారు..! అందుకే ఏ నాడూ టీడీపీని వీడని చాలా మంది సొంత సామాజికవర్గం వారు పార్టీ అభిమానాన్ని వదులుకుని కొఠారుకి చేశారు. ఇక ఈయన కూడా అంతే అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఆయన కూడా ఫక్తు పొలిటిషన్ లా మారిపోయారట. గెలిచాక ప్రవర్తనలో మార్పు రావడం.., కేవలం మాటలు మాత్రం చెప్తుండడం.., గత ప్రభుత్వంలో జరిగినట్టు ఇసుక, మట్టి అవినీతి కొనసాగుతుండడం.., ఈయనపై కూడా అసంతృప్తికి బాటలు వేసాయి.

 

అతిథి కోసం వెతుకులాట..!!

అందుకే దెందులూరు నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికల నాటికి వీళ్ళెవరూ వద్దు బాబోయ్ అంటూ అక్కడ ఆ వర్గం నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికే చర్చలు మొదలు పెట్టేసారు. టీడీపీలో అయితే నారా లోకేష్ ని పంపించండి గెలిపించుకుంటాం అంటూ రాయబారాలు నడుపుతుండగా.., వైసీపీలో కూడా కొత్త వెతుకులాట మొదలు పెట్టారట. అయితే ఒకటి మాత్రం నిజం. ఇక్కడ మంచి నాయకుడు వస్తే.., ఈ సామాజికవర్గం మొత్తం ఒక్కటిగా పనిచేస్తుంది. పార్టీ ఏదైనా పర్వాలేదు మమ్మల్ని సానుకూలంగా చూసుకుంటే చాలు ధోరణిలోకి వెళ్లిపోయే వీలుంది.