బిజెపి కాదన్నందుకే కాంగ్రెస్‌తో జత

అమరావతి: బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు జట్టు కట్టడానికి వైసిపి నాయకత్వం కొత్త కారణం వెదికింది. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం సహకరించనందువల్లే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు.నిజానికి ఈ మాట బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముందే అన్నారు. అక్కడి నుంచి విజయాసాయి రెడ్డి దీనిని అందిపుచ్చుకున్నారు. తన కక్ష సాధింపు చర్యలకు కేంద్రం సహకరించకపోవడంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో కావాలని జత కట్టారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పినట్లుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైఎస్‌ జగన్‌పైన ఏదో ఒక నేరం మోపి అరెస్టు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర సమస్యలు, నిధులపై చర్చించాలంటే వింటాం కానీ కేవలం వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ హయాంలో పెట్టిన కేసుల విషయంలో తామేం చేయగలమని కేంద్రం ప్రశ్నించడంతో చేసేదేమీ లేక చంద్రబాబు కాంగ్రెస్సే నయమని అటువైపు నడిచారని విజయసాయి రెడ్డి ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.