ప్రత్యేకహోదా వంచనపై ఢిల్లీలో వైకాపా గర్జన దీక్ష

ఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన పేరుతో గురువారం దీక్షను చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టారు. సాయంత్రం 4గంటల వరకూ ఈ దీక్ష కొనసాగుతుందని వైసీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుండి పోరాడుతుంది వైసీపీయేనని, చంద్రబాబే యుటర్న్ తీసుకున్నారన్నారు. విభజన హామీలపై వెనక్కుతగ్గకుండా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలలో వంచనపై గర్జన  దీక్షలు చేపట్టడంతో పాటు పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటిచెప్పడం జరిగిందన్నారు. ఈ దీక్షలో పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ కోఆర్డినేటర్ లు పాల్లొన్నారు.