‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రివ్యూ

Share

సినిమా: అమర్‌ అక్బర్‌ ఆంటోని
జానర్: యాక్షన్ డ్రామాసంగీతం: ఎస్‌. తమన్‌
కథ, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి
నటీనటులు: రవితేజ, ఇలియానా, తరుణ్‌ అరోరా, షాయాజీ షిండే, విక్రమ్‌‌జిత్ విర్క్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, లయ, శ్రీనివాస్‌రెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, సత్య, భరత్‌రెడ్డి, రవిప్రకాశ్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు.

మాస్ మహరాజా రవితేజ ఓ మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే చాలా కాలంగా సక్సెస్‌ లేని శ్రీను వైట్ల. వీరిద్దరి కాంబినేషన్‌‌లో తెరకెక్కిన తాజా మూవీ ‘అమర్‌ అక్బర్ ఆంటోని’. గోవా భామ ఇలియానా ఆరేళ్ల త‌ర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌‌లో రీఎంట్రీ ఇచ్చింది. హైప్‌ క్రియేట్ చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీపై హీరో, హీరోయిన్‌, దర్శకుడు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. ర‌వితేజ సినిమా అంటేనే ముందుగా గుర్తొచ్చేది హాస్యం. ద‌ర్శకుడు శ్రీను వైట్ల కూడా అదే బాట. మాస్ అంశాలు ఎన్ని ఉన్నా న‌వ్వించ‌డం మాత్రం వీరిద్దరూ మ‌రిచిపోరంటే అతిశయోక్తి కాదు. వీరి క‌ల‌యికలో వ‌చ్చిన దుబాయ్ శీను, వెంకీ చిత్రాలు మంచి వినోదాన్ని పండించాయి. ఈ కాంబోలో వచ్చిన నాలుగో చిత్రం ‘అమ‌ర్ అక్బర్ ఆంటోని’. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్‌ చేసిందా? రీ ఎంట్రీలో ఇల్లీబేబీ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది?

 

స్టోరీ:
ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీ స్థాపించి మిలియనీర్స్‌ అవుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగులుగా ఉన్న అరోరా (తరుణ్‌ అరోరా), సబూ మీనన్‌ (ఆదిత్య మీనన్‌), విక్రమ్‌ తల్వార్‌ (విక్రమ్‌‌జీత్‌), రాజ్‌‌వీర్‌‌ల నిజస్వరూపం తెలియని ఆనంద్‌, సంజయ్‌ కంపెనీలో 20 శాతం వాటాలిచ్చి షేర్‌హోల్డర్లుగా చేసుకుంటారు. పార్టనర్స్‌ అయిన వెంటనే ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్‌ అక్బర్‌ (షాయాజీ షిండే) సాయంతో అమర్‌, ఐశ్వర్య తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్‌ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్‌, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ కథలో అమ‌ర్‌‌కి, అక్బర్‌, ఆంటోనీ మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? అస‌లు వాళ్లెవ‌రు? అమ‌ర్, ఐశ్వర్య మ‌ళ్లీ ఎలా క‌లిశారనేది మిగతా కథ.

అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ఓ ప్రతీకార క‌థ‌. దానికి డి‌సోసియేటివ్ ఐడెంటిటీ అనే రుగ్మత‌ని జోడించి డ్రామాని పండించే ప్రయ‌త్నం చేశారు శ్రీను వైట్ల. ఉన్నట్టుండి తాను చూసిన వ్యక్తుల్లా మారిపోవ‌డం, మ‌ళ్లీ అందులో నుంచి బ‌య‌టికి రావ‌డమ‌నేదే ఈ రుగ్మత ల‌క్షణం. ఆ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న హీరో దాన్ని అధిగ‌మించి త‌ాను అనుకున్నది ఎలా సాధించాడ‌నేదే ఈ చిత్రం. సినిమా మొదట్లోనే ఇదో ప్రతీకార క‌థ అని తెలిసిపోతుంది. ఆ త‌ర్వాత అక్బర్‌, ఆంటోనీల పాత్రలు వ‌చ్చి వెళ్లే విధాన‌మే ఆస‌క్తి కలిగిస్తుంది. అయితే.. ఆదిత్య మేన‌న్‌‌ని చంపే స‌న్నివేశాలు కాస్త ఆస‌క్తి కలిగిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం బ‌లం లేదు. క‌థ నేప‌థ్యం కొత్తగా ఉన్నా.. క‌థ‌నం విష‌యంలో మాత్రం కొత్తద‌నం లేదు.

 

నటీనటులు:
మాస్ మహరాజా మరోసారి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్‌ పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. అక్బర్‌, ఆంటోనీల పాత్రల్లో కామెడీ కొంత మేరకు వర్కవుట్‌ అయినా సహజత్వం లోపించిందనే చెప్పాలి. ఆరేళ్ళ తర్వాత తెలుగు తెర మీద తళుక్కుమన్నది ఇలియానా. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. కొద్దిగా బొద్దుగా కనిపించినా.. పెర్ఫామెన్స్‌‌తో పాటు గ్లామర్‌‌తోనూ మెప్పించింది. రెండు పాట‌ల్లో అందంగా క‌నిపిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌‌జీత్‌ విర్క్‌ స్టైలిష్‌ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర లభించిందనే చెప్పాలి. జలాల్‌ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్‌ కమెడియన్స్‌‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌‌రెడ్డితో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌ కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌‌రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

విశ్లేషణ:
ఇటీవల సరైన సక్సెస్‌ లేని దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ అలాంటి అంచనాల్ని శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివెంజ్‌ డ్రామా కథకు న్యూయార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం అంతగా ఆసక్తి కలిగించదు. కామెడీ అక్కడక్కడా పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టులోలేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశాల్లో కామెడీ కావాలని ఇరికించిన ఫీలింగ్ వస్తుంది. పాటలకు తమన్‌ అందించిన మ్యూజిక్ పరవాలేదనిపించింది. నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌ ముందు వ‌చ్చే పాట మాత్రమే గుర్తుండిపోయేలా ఉంది. వెంక‌ట్ సి.దిలీప్ కెమెరా అమెరికా అందాల్ని బాగా చూపించింది. సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫీ. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌‌ఫుల్‌‌గా, అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. సినిమా స్థాయికి తగ్గట్టుగా ఎడిటింగ్ ఉంది. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌‌గా తెరకెక్కించారు.

బలాలు:
రవితేజ నటన
ప్రొడక్షన్‌ వాల్యూస్‌
క‌థ నేప‌థ్యం
బలహీనతలు:
స‌గ‌టు ప్రతీకార క‌థ, క‌థ‌నం
తెచ్చిపెట్టుకున్న కామెడీ
స్క్రీన్‌‌ప్లే
ప‌తాక స‌న్నివేశాలు


Share

Related posts

Akshara Review : అక్షర మూవీ రివ్యూ

siddhu

‘అల..వైకుంఠపురములో’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

Bangaru Bullodu review : బంగారు బుల్లోడు మూవీ రివ్యూ

siddhu

Leave a Comment