HUNT Review: సినిమా హిట్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కొన్నేళ్లుగా ఆయన మంచి సక్సెస్‌ను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సరిపోయే ఓ యాక్షన్ కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హంట్’. మహేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ వంటి హీరోలు కీలక పాత్ర పోషించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుంది? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై వివరంగా తెలుసుకుందాం రండి.

సినిమా: హంట్
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, కబీర్ సింగ్, చిత్రా శుక్లా, మైమ్ గోపీ, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, రవి వర్మ తదితరులు.
దర్శకత్వం: మహేష్
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
ఛాయాగ్రహణం: అరుళ్ విన్సెంట్
విడుదల తేదీ: 26 జనవరి 2023

సినిమా స్టోరీ:
అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సైబర్ క్రైమ్ బ్రాంచ్2లో విధులు నిర్వహిస్తుంటాడు. ఓ రోడ్డు ప్రమాదంలో అర్జున్ తన గతాన్ని మొత్తం మర్చిపోతాడు. ఆ ప్రమాదానికి ముందు అర్జున్ తన తోటి ఐపీఎస్ అధికారి ఆర్యన్ దేవ్ (భరత్) హత్య కేసుపై పని చేస్తుంటాడు. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టినట్లు పోలీస్ కమిషనర్ మోహన్ భార్గవ్ (శీకాంత్)కు కాల్ చేసి చెబుతుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. గతం మర్చిపోయిన అర్జున్ ఆ కేసును మళ్లీ కొత్తగా విచారణ జరపాల్సి వస్తుంది. ఓ వైపు తను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే.. ఆర్యన్ హత్య కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అర్జున్ ఎదుర్కొన్న సవాళ్లు? అర్జున్ గతం? అర్జున్-ఆర్యన్ మధ్య స్నేహం? ఆర్యన్ చంపిన వాళ్లను ఎలా పట్టుకుంటాడు? అనే అంశాలతో ‘హంట్’ సినిమాను తెరకెక్కించారు.

విశ్లేషణ..
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుధీర్ ఈ మూవీని ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మాట ఆయన ఎందుకు అన్నారనే విషయం క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి పాత్రలో సుధీర్ నటించడం సాహసోపేత ప్రయత్నమే చెప్పవచ్చు. కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ ను నమ్మే సినిమాను ఓకే చెప్పినట్లు అనిపిస్తోంది. డైరెక్టర్ పూర్తి స్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. మలయాళం మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్‌గా ‘హంట్’ను తెరకెక్కించారు. సినిమా స్టోరీ ప్రారంభించిన తీరు.. కథలోకి తీసుకెళ్లే విధానం బాగుంది. చాలా వరకు సీన్స్ సస్పెన్స్ తో నిండి ఉన్నాయి. దాంతో ప్రేక్షకులను ఆసక్తిరేకెత్తించేలా స్టోరీ ముందుకు సాగుతుంది. స్టార్టింగ్‌లో ఓ ఊపు కనిపించినా.. రాను రాను కథ స్లోగా రన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అర్జున్ గతం.. ఆర్యన్, మోహన్‌లతో అతని స్నేహ బంధం ఏ మాత్రం ఇంట్రెస్ట్ గా అనిపించవు. విలన్స్ బ్యాక్ స్టోరీలు కూడా సింపుల్‌గా ఉన్నాయి. థ్రిల్లర్ కథలో ఉండాల్సిన సస్పెన్స్ చాలా వరకు మిస్ అయినట్లు తెలుస్తుంది. సెకండ్ పార్ట్ లో హంతకుడు ఎవరనే విషయం తెలిసినప్పటి నుంచి కథలో కాస్త స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి.

ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం, సుధీర్ నటన, పోరాట సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
పేలవమైన స్క్రీన్ ప్లే
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 2.5/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.