బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ,జీవన్ తదితరులు
సంగీతం: శివకుమార్
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
ఆర్ట్: రాజ్‌కుమార్
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.
రచన-దర్శకత్వం : సమీర్ సుల్తాన్
పెళ్ళిచూపులు సినిమా పేరు వినగానే మనకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఒకరు తరుణ్ భాస్కర్, మరొకరు విజయ్ దేవరకొండ. వీరిద్దరికీ ఈ సినిమా చాలా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో సినిమా కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. అయితే ఈసారి విజయ్ దేవరకొండ నిర్మాతగా మారితే, తరుణ్ భాస్కర్ హీరోగా మారి సినిమా చేశారు. ఆ సినిమాయే `మీకు మాత్రమే చెప్తా`. మరి ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ నటుడిగా మెప్పించాడా? లేడా? నిర్మాతగా విజయ్ దేవరకొండ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడా? తరుణ్ , విజయ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని డైరెక్టర్ సమీర్ సుల్తాన్ నిలబెట్టుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం…
కథ:
రాకేష్(తరుణ్‌భాస్కర్) ఓ చిన్నపాటి ఛానెల్లో హోస్ట్‌గా పనిచేస్తుంటాడు. తనకి కామేష్(అభినవ్ గోమటం మంచి స్నేహితుడు. రాకేష్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే ఓ సినిమా కోసం రాకేష్ చేసిన ప్రయత్నాల్లో ఓ ఆగిపోయిన సినిమాలోని పోర్న్ వీడియో లీక్ అవుతుంది. ఆన్లైన్లోని ఆ వీడియోను డిలీట్ చేయడానికి రాకేష్ తన స్నేహితుడు కామేష్‌తో కలిసి పరుగులు పెడతాడు. ఆ సైట్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయాణంలో రాకేష్‌కి ఎలా పరిస్థితులు ఎదురవుతాయి. అసలు రాకేష్ వీడియోను అప్లోడ్ చేసిందెవరు? ఎవరైనా రాకేష్‌ను బ్లాక్ మెయిల్ చేశారా? అనే సంగతులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
సమీక్ష:
ఇప్పటి వరకు దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ నటుడిగా కూడా ఓకే అనిపించుకున్నాడు. ఈ చిత్రంతో ఏకంగా హీరోగానే కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. తనదైన టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో తరుణ్ భాస్కర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక అభినవ్ గోమట తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అనసూయ సినిమాలో చాలా కీలకమైన పాత్రలోనటించి ఆకట్టుకుంది. ఇక హీరో గర్ల్‌ఫ్రెండ్ ఇతర నటీనటులు అందరూ వారి వారి పాత్రల పరిధుల మేర చక్కగా నటించారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సెల్‌ఫోన్ వల్ల వచ్చే సమస్యలో ఓ సమస్యను కామెడీ పంథాలో దర్శకుడు షమీర్ చక్కగానే తెరకెక్కించాడు. సినిమాలో ఎక్కడా హై ఎమోషన్స్, ఫైట్స్ ఉండవు. చాలా కూల్‌గా సాగే పోయే చిత్రంలా అనిపిస్తుంది. అయితే సినిమా అంతా ఓకే పాయింట్ చుట్టూ తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. విజయ్‌దేవరకొండ నిర్మాతగా ఓకే అయినా నిర్మాణ విలువలు గొప్పగా ఏం లేవు. విజయ్ దేవరకొండ కోసం సిచ్యువేషనల్ కామెడీని ఇష్టపడేవారు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.
బోటమ్ లైన్:
మీకు మాత్రమే చెప్తా…ఓ సారి చూడొచ్చు
రేటింగ్: 2.25/5