మున్నా, దృషిక చందర్ హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ చిత్రం నేడు అల్లు అరవింద్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘ఆహా’ ఓటిటీ ప్లాట్ఫామ్ లో విడుదలైంది. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిహిరాంష్ సంగీతం అందించారు. పమిడిముక్కల చంద్ర కుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం
కథ
పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ తో మొదలయ్యే ఈ చిత్రంలో బాలు (మున్నా) తన ఇంటి పక్కన ఉండే స్వప్న (దృషిక) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతనిపై అంతే ప్రేమను చూపిస్తుంది. స్వప్న తండ్రి కుల పిచ్చి కలవాడు. తన పరువుని, తన కులం పరువుని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే అతను తన కూతురు ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ యువ జంట ఇంటి నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వారు ఆ ప్రయత్నంలో సఫలం అయ్యారా…. వారికి ఆ లవ్ జర్నీ లో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి అన్నది సినిమా.
ప్లస్ లు
విజువల్స్ చాలా బాగున్నాయి
సినిమా సౌండ్ ట్రాక్ ప్రభావవంతంగా ఉంది
మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉండే సినిమా
చిన్ననాటి ఎపిసోడ్ లు అన్నీ చక్కగా చిత్రీకరించబడ్డాయి
మైనస్ లు
రొటీన్ కథ
మెచ్యూరిటీ లేని స్క్రీన్ ప్లే
ఎమోషనల్ కంటెంట్ లోపించడం
భయంకరమైన లాగ్
ఎంటర్టైన్మెంట్ కొదవ
విశ్లేషణ
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు ఈ చిత్రంలో కులపిచ్చి తండ్రిగా బాగా మెప్పించాడు. మున్నా, దృషిక తమ మొదటి సినిమా అయినా ప్రేక్షకులకు ఆ భావనను కలిగించలేదు. చిన్ననాటి ఎపిసోడ్లలో అయితే ఎంతో గొప్పగా నటించారు. ఇక ఎమోషనల్ ఎపిసోడ్స్ వద్దకు వచ్చేటప్పటికి మాత్రం కొత్త నటీనటులు తేలిపోయారు. సబ్జెక్ట్ విషయానికి వస్తే చాలా రొటీన్ కథాంశం తీసుకున్న కృష్ణ పోలూరు దానిని కొత్తగా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఎన్నో తరాలుగా చెబుతున్న కథ చుట్టూ ఒక కథనం రాసుకొని ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. స్క్రీన్ ప్లే, సన్నివేశాలు చాలా రొటీన్ గా ఉన్నాయి. రెండు గంటల 5 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాకి టాప్ ఎడిటర్ అయిన మార్తాండ్.కె.వెంకటేష్ చాలా సులువుగా ఒక 30 నిమిషాల సినిమా తీసివేయవచ్చు. అప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. ఒక ప్రేమ కథా చిత్రానికి ఉండవలసిన ఎమోషన్ ను డైరెక్టర్ పండించలేకపోయాడు.
ఇంతకీ చూడొచ్చా..?
‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ చిత్రం స్టోరీ టెల్లింగ్ లో, ప్రజెంటేషన్ లో మీకు ఎలాంటి కొత్తదనం ఇవ్వదు. చాలా రొటీన్ స్టోరీని చాలా ఇంకా రొటీన్ పద్ధతిలో దర్శకుడు తెరకెక్కించాడు. సినిమాలో చిత్తూరు యాస, కొన్ని చిన్ననాటి సన్నివేశాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఎటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడంతో ప్రేక్షకులు కచ్చితంగా నిరుత్సాహపడతారు. ఈ సినిమాను చాలా సౌకర్యవంతంగా స్కిప్ చేయొచ్చు.
న్యూస్ ఆర్బిట్ రేటింగ్ : 1.75/5
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!