NewsOrbit
రివ్యూలు

చరిత్రకు..ఎంతెంత దూరం!

సైరా చక్కటి చిత్రం. అయితే ఒక్కటే పేచీ. దానిని చారిత్రాత్మక చిత్రం అన్నారు. అక్కడే కాస్త మింగుడు పడడం లేదు. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే రాయలసీమకు చెందిన ఆ సాహసి స్వేచ్ఛా పిపాస మినహా సినిమాలో ఉన్న మరేదీ సైరా నరసింహారెడ్డి వాస్తవ జీవిత చిత్రణకు దగ్గరగా కనబడదు.

అందుకనే దర్శకుడు సురేందర్ రెడ్డి ముందే జాగ్రత్త పడ్డాడు. ఓ దీర్ఘమైన డిస్‌క్లయిమర్ సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులకు అందించాడు. సినిమా కాబట్టి కాస్త స్వేచ్ఛ తీసుకుని అసలు కథకు కాల్పనికత జోడించామనీ చెప్పుకున్నారు. పేచీ లేని పని అన్న మాట. కానీ అంత తేలికైన విషయమా అది.

నరసింహారెడ్డి నిజ జీవిత వైభవాన్ని చిత్రించడం కోసమే ఆ మాత్రం స్వాతంత్ర్యం తీసుకున్నామని దర్శకుడు చెప్పాడు. నిజ జీవిత వైభవాన్ని ఇంకాస్త వైభవంగా చూపించినా ఇబ్బంది లేదు. కానీ ఒక చారిత్రక పురుషుడికి ఆ చరిత్రలో చోటు సంపాదించి ఇచ్చిన జీవితభాగం వీలైనంత వరకూ వాస్తవానికి దగ్గరగా ఉండవద్దూ? దానికి సంబంధించిన కోణాలను స్పృశించవద్దూ?

సైరాలో ఆ ప్రయత్నం పెద్దగా కనబడదు. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లు కథాగమనం ఉంటుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనబడుతుంది. ఎక్కడా ఆనాటి రేనాటి సీమ పరిస్థితులు, సామాజిక జీవనం, కట్టుబొట్టూ కనబడదు. పాలెగాడయిన నరసింహారెడ్డి ఓ రాజుగారి స్థాయిలో కనబడతాడు. చారిత్రక కధాంశంతో సినిమా తీసినపుడు, అచ్చంగా ఆనాటి పరిస్థితులనూ, వాతావరణాన్నీ కళ్లకు కట్టడంలోని మజా మన దర్శకులకు ఇంకా తెలియదు, ఏం చేస్తాం! దర్శకుడు చిత్రించదలచిన పద్ధతిలో చిరంజీవి ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు, అయితే చిరంజీవి మాత్రం చిత్రం అంతా తానైపోయాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి సీమకు చెందిన పాలెగాడు. అంటే ఒక జమీందారు స్థాయి పాలకుడు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం తరపున భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం చేస్తోంది. దానికి వ్యతిరేకంగా తోటి పాలెగాళ్లనూ, బోయలనూ, చెంచులనూ కూడగట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేశాడు. 1846 జూన్‌లో మొదలయిన నరసింహారెడ్డి పోరాటం 1847 ఫిబ్రవరిలో ఆయన బలిదానంతో ముగిసింది.

ఆయన వీరోచిత పోరాటం సీమ ప్రజలను ఆ రోజుల్లో ఎంతగా ప్రభావితం చేసిందంటే నరసింహారెడ్డి వీరగాధలు జానపదాలుగా మారి జనం నోళ్లలో నానటం మొదలుపెట్టాయి. బ్రిటిష్ రికార్డులకు పరిమితమైపోయిన నరసింహారెడ్డి చరిత్ర ఆ విధంగా జనం గుండెల్లో నిలిచి ఒక తరం నుంచి ఇంకో తరానికి పాటల రూపంలో అందింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాధను కీర్తించే పాటలను ప్రముఖ జానపద గాయకుడు మునెయ్య, ప్రముఖ విద్యావేత్త తూమాటి దోణప్ప సేకరించి భద్రపరిచారు. అలాంటి జానపద గేయాలలో ఒకటి ‘సైరా నరసింహారెడ్డీ, నీ పేరే బంగారపు కడ్డీ’ అనే పల్లవితో  మొదలవుతుంది. కొణిదెల వారి చిత్రానికి సైరా అన్న పేరు పెట్టడానికి స్ఫూర్తి ఈ పల్లవే.

ఈ విశేషాలలో కొన్ని మాత్రమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధలో భాగం. కొన్ని ఆయన వీరగాధ మనకు ఇచ్చిన వారసత్వంలో భాగం.  ఇవన్నీ కూడా ఉయ్యాలవాడ చరిత్ర పునసృష్టికి పూర్వోత్తర సంబంధాన్ని (context) తెచ్చిపెట్టే అంశాలు. వీటిని పట్టించుకోకుండా వదిలిపెట్టడం ద్వారా దర్శకుడు తాను ‘వైభవం’గా చిత్రించిన సినిమాకు కాస్త చారిత్రక ప్రామాణికత అద్దే  అవకాశాన్ని చేజేతులా వదులుకున్నాడు.

సైరా చిత్రీకరణలో సురేందర్ రెడ్డికి మెల్ గిబ్సన్ చిత్రం బ్రేవ్‌హార్ట్ కొంతమేర స్ఫూర్తిగా నిలిచినట్లు తోస్తుంది. అది కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఓ స్వేచ్ఛా పిపాసి జీవితగాధే. ముఖ్యంగా క్లయిమాక్స్ సన్నివేశం బ్రేవ్‌హర్ట్‌ను వెంటనే గుర్తుకు తెస్తుంది.

బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించిన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం కన్నా పదేళ్ల ముందే తెలుగు గడ్డపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే యోధుడు బ్రిటిష్ పెత్తనానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశాడన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. 1857నాటి తిరుగుబాటుతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదయినప్పటికీ స్ఫూర్తిదాయకమైనదన్న విషయంలో కించిత్తు కూడా సందేహం లేదు.

చరిత్రలో అర్హమైన విధంగా నమోదు కాని ఈ విషయాన్ని కూడా దర్శకుడు ప్రతిభావంతంగా చెప్పలేక పోయాడు. ఆ సంగతి చెప్పడానికి ఝాన్సీ లక్ష్మీబాయి సహాయం తీసుకున్నాడు కానీ సరిపోలేదు. కనీసం సినిమా చివర పవన్ కళ్యాణ్ స్వరంతో ఇచ్చిన ముక్తాయింపు ద్వారా ఈ నష్టం పూడ్చుకోవాల్సింది.

చివరగా ఒక విషయం. చిత్రం ప్రారంభంలో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఇద్దరు తెల్ల దొరలు మాట్లాడుకుంటూ ఉంటారు. మొఘలు చక్రవర్తులు చాలాకాలం పాటు భారతదేశం సంపదను దోచుకోగలిగారు కానీ భారతీయుల పౌరుష పరాక్రమాలను ఏం చేయలేకపోయారని వారిలో ఒకరు అంటారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజ జీవిత వైభవం చిత్రించడం కోసం ఆయన జీవితగాధకు కాల్పనికత జోడించామంటే పోనీలే అనుకోవచ్చు గానీ, మొఘలులు దేశాన్ని దోపిడీ చేశారంటూ చరిత్రతో ఆడుకుంటే ఎలా?

బాబర్‌తో మొఘలుల పాలన మొదలయింది. ఇండియాపై దండెత్తి వచ్చిన మొఘలాయిలు ఈ దేశాన్ని తమ సొంత గడ్డగా స్వీకరించారు. ఈ దేశ చరిత్రలో, సంస్కృతీ వికాసంలో విడదీయరాని భాగమైపోయారు. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ యోధులు చివరి మొఘల్ పాలకుడైన రెండవ బహదుర్ షా జఫర్‌ను తమ నాయకుడిగా స్వీకరించిన విషయం సురేందర్ రెడ్డికి తెలిసినట్లు లేదు.

ఆలపాటి సురేశ్ కుమార్

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment