నిదానంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాగా ప్యూర్ తెలుగు కంటెంట్ అయిన ‘ఆహా‘ యాప్ వారు కూడా ఒరిజినల్ కంటెంట్ తీసుకుని వస్తున్నారు. ‘మెయిల్‘ లాంటి మంచి ఫన్ మూవీ తర్వాత నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, అజయ్ ఇలాంటి ప్రధాన తారాగణం తో ‘సూపర్ ఓవర్‘ అనే మరో చిన్న బడ్జెట్ చిత్రాన్ని తమ ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా విడుదల చేశారు. ప్రవీణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ నిర్మాత. సన్నీ బాణీలు అందించాడు. దాదాపు 80 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ
కాశీ (నవీన్ చంద్ర), వాసు (రాకేందు మౌళి), మధు (చాందిని) ముగ్గురూ మంచి మిత్రులు. అయితే కాశి క్రికెట్ బెట్టింగ్ ద్వారా చాలా సులువుగా డబ్బు సంపాదించాలని ఎప్పటినుండో ప్లాన్ వేస్తుంటాడు. అతను అనుకున్నట్టే ఎంపీఎల్ అనే గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపు కోటి 70 లక్షల రూపాయలు గెలుస్తాడు. అయితే వచ్చిన డబ్బుని వారు లాండరింగ్ చేయవలసి ఉంటుంది. తన స్నేహితుల సహాయంతో డబ్బుని లాండరింగ్ చేసే క్రమంలో పెద్ద ప్రమాదం లో పడతాడు. ఆ తర్వాత అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు వారికి మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. ఇక ఆ తర్వాత ఒకే రాత్రిలో వారు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి…? వాటి నుండి ఎలా బయట పడ్డారు అన్నది మిగిలిన సినిమా.
ప్లస్ లు
నవీన్ చంద్ర, చాందినీ చౌదరి పర్ఫార్మెన్స్
యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ
మంచి సినిమాటోగ్రఫీ ,విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ లు
అతికించినట్లు ఉండే స్క్రీన్ ప్లే
అనవసరం అనిపించే కొన్ని సన్నివేశాలు
పెద్దగా థ్రిల్ కలిగించని అంశాలు
అంత లోతులేని స్టోరీ
విశ్లేషణ
‘సూపర్ ఓవర్ చిత్రం‘ పేరుకు తగ్గట్టే కథ చాలా త్వరగా మొదలయ్యి అంతే త్వరగా ముగిసిపోతుంది. అయితే అంత తక్కువ నిడివి ఉన్న సినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తగా ఉండవలసింది. ఎంతో ఇంట్రెస్టింగ్గా మొదలయ్యే కథనం మధ్యభాగంలో కి వచ్చేసరికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కొద్దిగా డల్ అవుతుంది. అయితే అక్కడక్కడ మంచి సన్నివేశాలు ఉండబట్టి ప్రేక్షకులకి చివర్లో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అన్న ఆశ వస్తుంది. అయితే కథ ఉన్న 80 నిమిషాలు కూడా పైకి కిందకీ పడిలేస్తూ కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నవీన్ చంద్ర, చాందిని పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాను చాలా వరకు బ్రతికించింది అని చెప్పాలి. కథ ను మరింత లోతుగా వివరించి… కొద్దిగా స్క్రీన్ప్లే పై దృష్టి పెట్టి ఉంటే చాలా మంచి చిత్రంగా నిలిచేది. అయితే తక్కువ నిడివి ఉండడం సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి.
ఇంతకీ చూడొచ్చా..? : బాగా ఖాళీగా ఉంటే అలా టైంపాస్ కి చూసేయొచ్చు…!