Review Zombie Reddy : తెలుగులో మొట్టమొదటి జాంబీ ఫిలిం గా తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి‘ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రయోగాత్మక దర్శకుడిగా మంచి పేరున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి భారీ ప్రమోషన్స్ చేశాడు. ట్రైలర్, టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తమిళ బ్యూటీ కాయల్ ఆనంది, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్, దక్ష నాగర్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
Review Zombie Reddy కథ :
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టి కోవిడ్ వల్ల సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నుండి ఈ సినిమా మొదలవుతుంది. ఇదే సమయంలో ఒక సైంటిస్ట్ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉంటాడు. ఇటు చూస్తే మన హీరో తేజ, కిరీటి, హేమంత్, దక్ష అందరూ స్నేహితులు, వృత్తిరీత్యా గేమింగ్ డిజైనర్స్. అయితే లాక్ డౌన్ సమయంలో తప్పని పరిస్థితుల్లో హేమంత్ కర్నూల్ లో తన పెళ్లి పెట్టుకుంటాడు. తన తన మిత్రుడి పెళ్ళికి వీరంతా కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఆ సైంటిస్ట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ వికటించి అక్కడ ఉండే మనుషులు అంతా జాంబీలు గా మారిపోతారు. అది ఒకరి నుండి ఒకరికి పాకుతూ ఇంటర్వెల్ సమయానికి తేజ, ఆనంది, దక్ష, శ్రీను, హేమంత్ లు తప్ప ఊరంతా జాంబీలు అయిపోతారు. ఇక అక్కడి నుండి ఆ జాంబీల గుంపు నుండి వారిని వారు ఎలా రక్షించుకుంటారు…. ఇక ఈ సమస్యకు చివరికి వీరికి ఏదైనా జవాబు దొరికిందా లేదా వీరే వారి దెబ్బకు జాంబీలుగా మారిపోయారా? అన్నదే కథాంశం.
పాజిటివ్ లు :
- సినిమాలో రెండవ అర్ధ భాగం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుం.ది దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలివేషన్ షాట్స్ దగ్గర నుండి కామెడీ సీన్లు, థ్రిల్లింగ్ సన్నివేశాలు అన్నీ ఇందులోనే పెట్టేసాడు. అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా సాగిపోతుంది.
- ఆపిల్ ట్రీ స్టూడియోస్ వారి విజువల్స్ టాప్ లెవెల్ లో ఉన్నాయి. జాంబీల మేకప్, వాటి బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా హాలీవుడ్ సినిమాను తలపించింది.
- రెండవ అర్ధ భాగంలో వచ్చే కామెడీకి పూర్తి మార్కులు ఇవ్వాలి. ముఖ్యంగా గెటప్ శ్రీను అన్నపూర్ణమ్మ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది.
- ఇంటర్వెల్ లో వచ్చే ఎపిసోడ్ అయితే పక్కా విజిల్ మొమెంట్. జాంబీలతో ఆ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ తీయడం అనేది చిన్న విషయం కాదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు తగినట్లు ఎంతో ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. మార్క్ కె రాబిన్ కు దీనికి పూర్తి మార్కులు ఇవ్వవచ్చు.
నెగిటివ్ లు :
- ఈ సినిమాలో మొదటి అర్ధభాగం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ట్రీట్మెంట్ గా ఉంటుంది. రెండవ భాగం అంత బాగా రాసుకున్నప్పుడు మొదటి భాగంలో కూడా కొన్ని మంచి సన్నివేశాలు దర్శకుడు పెట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
- యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. జాంబి ఎఫెక్ట్ బాగుంది. కామెడీ సూపర్ గా ఉంది. కానీ కథనం మాత్రం బాగా రెగ్యులర్ అనిపిస్తుంది. తెలుగులో మొదటి సారి ఒక జాంబీ సినిమా చేస్తున్నప్పుడు ఇంతకు ముందు వచ్చిన జాంబీ ల కథాంశాన్నే ఈ సినిమాలోని ఇక్కడ వాడడం అనేది హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు కి కొద్దిగా బోర్ కొట్టిస్తుంది.
- క్లైమాక్స్ భాగానికి మిక్స్డ్ రివ్యూ వచ్చింది. లాజిక్ లు వెతికే వారికి మాత్రం ఇది నిరాశపరచే విషయమే. అయితే కామెడీ పరంగా తృప్తి చెందినవారికి ఓకే అనిపిస్తుంది. కానీ లాజిక్ పరంగా ఆలోచించే చాలామందికి ఇది సంతృప్తినివ్వని అంశమే.
Review Zombie Reddy
విశ్లేషణ :
అ, కల్కి సినిమాలతో ఇండస్ట్రీ దృష్టిలో పడిన ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా ‘జాంబీరెడ్డి‘ సినిమా ప్రకటించేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక తన దమ్ము కి న్యాయం చేసేలా ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశాలు రూపొందించాడు. జాంబీల బాడీ లాంగ్వేజ్, నటీనటుల దగ్గర పర్ఫార్మెన్స్ రాబట్టడం వరకు ప్రశాంత్ వర్మ చాలా విషయాల్లో సక్సెస్ అయ్యాడు. అయితే రైటర్ గా మొదటి అర్ధ భాగంలో కొన్ని కీలక సన్నివేశాలు రాసుకొని ఉంటే ఎంతో బాగుండేది. రెండవ అర్ధ భాగం పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసాడు. అసలు ఇంటర్వెల్ తర్వాత నుండి క్లైమాక్స్ వరకు ఒక్క చోట కూడా బోర్ కొట్టనివ్వలేదు. అయితే మొదటి అర్ధ భాగంలో జనాలకు విసుగు పుట్టడమే పెద్ద మైనస్ అని చెప్పాలి. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎంతో బాగుంది. సెకండాఫ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వాటితో పాటు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక తెలుగు ఆడియన్స్ కు మొదటిసారి స్క్రీన్ పైన మన వాతావరణంలో జాంబీ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది.