కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డికో స్టైల్ ఉంది. ఆయన తెరకెక్కించిన సీమటపాకాయ్, ఆడోరకంఈడోరకం, దేనికైనా రెఢీ వంటి చిత్రాలను మంచి ఆదరణనే పొందాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందిన మరో చిత్రం `తెనాలి రామకృష్ణ బీఏబీఎల్`. డిఫరెంట్ సినిమాలు చేస్తున్న హీరో సందీప్ కిషన్ ఇందులో టైటిల్ పాత్రను పోషించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రమిది. మరి ఈ చిత్రం ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.
బ్యానర్: ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, అన్నపూర్ణమ్మ, వై.విజయ, కిన్నెర, సత్యకృష్ణ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
కెమెరా: సాయిశ్రీరామ్
కథ: రాజసింహ
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, కె.సంజీవ రెడ్డి, శ్రీనివాస్ ఇందుమూరి, రూపా జగదీష్
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
కథ:
తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) చెట్టుకింద ప్లీడర్. లాయర్ చదివినా ఎలాంటి కేసులు రావు. దాంతో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులను సెటిల్మెంట్స్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. పొలిటికల్‌గా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్పి పి.శర్మ) స్థానికంగా మంచి పేరున్న వరలక్ష్మి దేవిని ఓ జర్నలిస్ట్ హత్య కేసులో దొంగ సాక్ష్యాలన సృష్టించి జైలుకు పంపుతాడు. ఆ విషయం తెలుసుకున్న తెనాలి రామకృష్ణ లాయర్ చక్రవర్తి(మురళీశర్మను) ఓడించి వరలక్ష్మిని నిర్దోషిగా నిరూపిస్తాడు. అయితే తెనాలి రామకృష్ణకు ఊహించని నిజాలు కొన్ని తెలుస్తాయి. ఆ నిజాలేంటి? ఇంతకు జర్నలిస్టును చంపిందెవరు? తెనాలి హంతకుడిని చట్టానికి పట్టిచ్చాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ ఏడాది హారర్ థ్రిల్లర్ `నిను వీడని నేనే`తో సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ అందుకు భిన్నంగా ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విచాడు సందీప్. ప్రభాస్ శ్రీను ఇతని స్నేహితుడి పాత్రలో కామెడీని పండించడంలో తనవంతు సపోర్ట్‌ను అందించాడు. ఇక సప్తగిరి కూడా క్లయింట్‌గా చక్కగా నవ్వించాడు. నటుడిగానే కాదు… ఈ సినిమాలో మరోసారి డ్యాన్సులతో సందీప్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హన్సిక ఏమీ తెలియకపోయినా, అన్నీ తెలుసు అని అనుకునే లాయర్ రుక్మిణి పాత్రలో నవ్వించింది. జడ్జి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరో తండ్రి పాత్రలో రఘుబాబు, ఇక అన్నపూర్ణమ్మ, వై.విజయ, మురళీశర్మ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. నాగేశ్వరరెడ్డి కామెడీ అన్ని సందర్భాల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పస్టాప్ కాస్త బాగానే ఉన్నట్లు అనిపించినా సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వరలక్ష్మి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు, ఆమె దగ్గర వెన్నెలకిషోర్, సప్తగిరితో చేయించిన కామెడి ప్రేక్షకుడికి నవ్వు తెప్పించదు విసుగ్గా అనిపిస్తుంది. వెన్నెలకిషోర్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్‌ను ఏదో సినిమాటిక్‌గా ముగించేయాలని అనిపించినట్లుగా ఉంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ గొప్పగా లేదు. సాయికార్తీక్ సినిమాటోగ్రఫీ బావుంది.
చివరగా.. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ .. ఆకట్టుకోలేని నవ్వుల లాయర్ కథ
రేటింగ్: 2.25/5