డ్రగ్స్ బాధితులకు భారీ సర్కారీ నజరానాలు!

హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రగ్స్ వాడే వారంతా బాధితులు మాత్రమేనని ఇప్పటికే విస్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ తాజాగా మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి న్యూవేవ్స్ వ్యంగ్యవార్తా విభాగానికి అందిన అధికారిక ప్రకటన ప్రకారం డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది. డ్రగ్స్ వాడిన, వాడుతున్నవారిని బాధితులుగా గుర్తించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వనుంది.  ఒక్కో బాధితుడికి కనీసం రూ.2 లక్షలకు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించేందుకు కసరత్తు ప్రారంభించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. డ్రగ్స్ వాడినవారు, వాడుతున్న వారంతా లబ్ధిదారులయేందుకు తమ పేర్లను నమోదు చేయించుకోవాలనీ, ఇందుకు ఆధార్ నంబర్‌ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఇకమీదట నోటీసులివ్వడం ఉండదనీ, బాధితులే ముందుకు వచ్చి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవలసి వుంటుందనీ ప్రకటన పేర్కొంది.

డ్రగ్స్ తీసుకున్న బాధితులకు వారు కోరుకున్న చోట ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని ప్రకటన వివరించింది. డ్రగ్స్ బాధితులు, వారు ఏ రంగానికి చెందినవారైనా, వారి ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ సదుపాయాలన్నీ అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.డ్రగ్స్ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా ప్రాధాన్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్యాంకు రుణాల్లో సైతం ఈ బాధితులకు ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం వివరించింది.బాధితులు  ఐచ్ఛికంగా అక్రమ డ్రగ్స్ సరఫరాదారుల పేర్లు కనుక వెల్లడిస్తే వారికి రూ.2 లక్షల నజరానా ఉంటుందనీ, ఇది వారికి లభించే అదనపు మొత్తమనీ ప్రభుత్వం పేర్కొంది.

కొత్త రాష్ట్రమైనా డ్రగ్స్ కేసుతో దేశం మొత్తంలో తెలంగాణ పేరు మార్మోగేట్లు చేసిన డ్రగ్స్ బాధితులకుముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతపూర్వకంగా ఈ విధానాన్ని ప్రకటించారనీ ప్రకటన వివరించింది. డ్రగ్స్ బాధితుల్లో సినిమా, ఐటీ రంగాలకు చెందిన వారు  ఎక్కువగా ఉండడంతో ఆ రంగాలకు ప్రత్యేకంగా పథకాలను ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. వచ్చే ఏడాది అధికారికంగా డ్రగ్స్ విధానాన్ని ప్రకటించి వార్షిక బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించదలచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై ఏడాదికొకసారి హరిత హారంలాగా డ్రగ్స్ వారం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలావుండగా, మద్యంలాగే డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే దాని నుండి గణనీయంగా ఆదాయం కూడా సమకూరుతుందనీ, ఆ రాబడి నుండి కొంత మొత్తాన్ని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికీ, బాధితుల నష్టపరిహారం చెల్లింపులకీ ఉపయోగించవచ్చునని తెలంగాణ ఆర్థిక శాఖ సూచించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సూచనకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా, ప్రభుత్వం ఇలా ఉదారంగా డ్రగ్స్ బాధితుల పక్షం వహించడాన్ని తెలంగాణ డ్రగ్స్ బాధితుల సంఘం ఒక ప్రకటనలో స్వాగతించింది. అయితే ఈ చర్యలు సరిపోవనీ, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ బాధితులకు వెయిటేజీ ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. మరోవైపు డ్రగ్స్ బాధితుల ఓట్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానం ప్రకటించిందని కాంగ్రెస్, వామపక్షాలు విమర్శించాయి. విధానంలో చిత్తశుద్ధి లేదనీ, డ్రగ్స్ వాడకందార్లకు ప్రభుత్వం కనీసం ఐదేసి లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనీ విపక్షాలు డిమాండ్ చేశాయి.

అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లోగడ టీడీపీ, కాంగ్రెస్ పరిపాలనల నుండి డ్రగ్స్ రాకెట్ తమకు వారసత్వంగా వచ్చిందే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. మారుతున్న దేశకాల పరిస్థితులను బట్టి చూస్తే మాదక ద్రవ్యాలు ఇప్పుడు టీపొడి, పాన్ మసాలాలాంటివే నన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై వరుస ట్వీట్లు చేస్తూ హైదరాబాద్ విశ్వనగరంగా గుర్తింపు పొందే క్రమంలో ప్రభుత్వ డ్రగ్స్ విధానం నిస్సందేహంగా ఒక ముందడుగు అన్నారు. కేసీఆర్ ఇప్పటికే వెల్లడించిన డేటా ప్రకారం చూస్తే డ్రగ్స్ విషయంలో ముంబై, పుణే చివరికి కాన్పూర్‌ల కంటే హైదరాబాద్ వెనుకబడి ఉండడాన్ని గమనించాలన్నారు. ఏమైనా ఇప్పటికైనా డ్రగ్స్‌ను తెలంగాణలోనూ చర్చనీయాంశం చేసినందుకు ఆయన ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అభినందించారు. మరోవైపు వివాదాస్పద ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ విధానం ఇతర రాష్ట్రాలకూ ఆదర్శమని తన ఫేస్‌బుక్‌ పోస్టులో వ్యాఖ్యానించారు.