NewsOrbit
సెటైర్ కార్నర్

‘సెల్ఫ్ డిస్మిస్‌’ పాలసీ!

 (న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నిరవధిక సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారవర్గాల అనధికార సమాచారం ప్రకారం సమ్మె కొనసాగినన్నాళ్లు నిరవధికంగా సమీక్షలు జరుపుతూ ఉండాలని ఆయన నిర్ణయించారు. సమ్మె ఎన్నాళ్లు ఉంటుందో అన్నాళ్లూ పాఠశాలలకు నిరవధికంగా సెలవులు కొనసాగించాలని ఆయన ఆదేశించారు. దసరా తర్వాత దీపావళి వస్తుంది కాబట్టి కొనసాగించిన సెలవులను దీపావళి సెలవులుగా పరిగణించాలని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎలాగూ క్రిస్మస్ వస్తుంది కనుక వాటిని క్రిస్మస్ సెలవులుగా డిక్లేర్ చేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఇక ఆ తర్వాత సంక్రాంతి సెలవులుంటాయి కాబట్టి ఇబ్బందే లేదని సీఎస్ ఎస్ కే జోషీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు. కొన్నాళ్లు పోయాక ఆన్ లైన్ పాఠశాలలు, ఆన్ లైన్ పరీక్షలు పెట్టేస్తే సరి అని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను తెప్పించి తిప్పితే తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యం మరింత వెల్లివిరుస్తుందని కూడా సీఎస్ సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. 

మరోవైపు ఆర్టీసీ సమ్మె వల్ల  హైదరాబాద్ రోడ్లపై ట్రాపిక్ సమస్య దానంతట అదే తీరినట్లైందని అధికారులు సీఎంకు నివేదించినట్లు సమాచారం. సమ్మె వల్ల కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సీఎంకు వివరించారు. అలాగే ఆర్టీసీ సమ్మె కారణంగా జనం ఊరకే వీధుల్లో తిరగకుండా త్వరగా ఇళ్లు చేరుతున్నందున నేరాలు – ఘోరాలు సైతం తగ్గాయని పోలీసు ఉన్నతాధికారులు కేసీఆర్ కు తెలిపారు. అధికారులు చెప్పినవన్నీ సావకాశంగా విన్నమీదట ఇవన్నీ సానూకూల పరిణామాలేనని కేసీఆర్ తల ఊపుతూ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

ఇదిలావుండగా, ఇకపై ఏశాఖ ఉద్యోగులు సమ్మెకు దిగినా వారు ఆ క్షణమే సెల్ఫ్ డిస్మిస్ అయిపోయే విధంగా నిర్దిష్టమైన ఒక విధానం అమలులోకి తేవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సెల్ఫ్ డిస్మిస్ పాలసీతో తాను దేశానికే దిక్సూచినవుతాననీ, ఈ విధానాన్ని కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాపీ కొట్టక తప్పదనీ ఆయన విశ్వసిస్తున్నారు. ఇక బంగారు తెలంగాణలో సమ్మెలు చేయడం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడమేనని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాగైతే చట్టబద్ధమైన సమ్మె ఒకటి ఉంటుందన్న భావన ఏర్పడుతుందనీ, దానిబదులు సమ్మె అన్న మాటే చట్టవిరుద్ధమంటూ చట్టబద్ధ ప్రకటన చేస్తే మంచిదనీ రాష్ట్ర న్యాయ శాఖ అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ సూచనను ఆమోదించిన సీఎం వెంటనే ఆ పని సంగతి చూడమని ఆదేశించారు.

ఇకపోతే ఆర్టీసీలాగే ఇకపై ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని కేసీఆర్ కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలోచనలు కనుక కార్యరూపం దాల్చితే ఇకమీదట ప్రభుత్వ సీఎం, ప్రైవేటు సీఎం అని రెండు కీలక పోస్టులు ఉంటాయి. ప్రైవేటు సీఎంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను నియమించే అవకాశాలున్నాయి. ప్రతి శాఖకూ ప్రభుత్వ మంత్రి, ప్రైవేటు మంత్రి విడివిడిగా ఉంటే మంత్రి పదవులు పెరిగి పార్టీలో కూడా అసమ్మతి, అసంతృప్తి తగ్గుతాయని కేసీఆర్ తలపోస్తున్నారు.

కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై కేటీఆర్ ఒక ట్వీట్ చేస్తూ.. ప్రజల సౌకర్యం కోసం ఎయిర్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా తమ కార్లలో చార్జీలు తీసుకోకుండా జనానికి లిఫ్టులివ్వాలని సూచిస్తూ ఆయన తన మానవతాదృక్పథాన్ని చాటుకున్నారు.

Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం.  ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.
author avatar
Srinivasa Rao Y

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

Leave a Comment