ఫేస్ బుక్ పరిచయం.. ఏకంగా అరకోటికి నామం పెట్టేశారు!

సోషల్ మీడియా లతో తస్మాత్ జాగ్రత్త.. ఎందుకు అనుకుంటున్నారా? ఓ యువతి ఫేస్ బుక్ తో గాలం వేసి.. రూ.50 లక్షలు ఎగరేసుకు పోయింది మరి..! కాలం మారుతూ అనేక విప్ల‌వాత్మ‌క సంచ‌ల‌న మార్పులు తీసుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం సాధించిన అభివృద్ధి కార‌ణంగా స్మార్ట్ ‌ఫోన్‌ల వినియోగం పెర‌డ‌గం, మ‌రీ ముఖ్యంగా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌తో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి రావడంతో ప్ర‌పంచ‌మంతా అర‌చేతిలోకి చేరింది. నిత్యం సోష‌ల్ మీడియాలో త‌మ‌కు సంబంధించి విష‌యాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌డం పెరిగింది. అయితే, కొంద‌రు కేటుగాళ్లు సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా ముఖ ప‌రిచ‌యం లేనివారు సైతం.. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకుని.. మోసాల‌కు పాల్ప‌డుతూ.. ల‌క్ష‌లు దండుకుంటున్నారు. ఇలాంటి కేసులు నిత్యం వెలుగు చూస్తున్నప్ప‌టికీ.. క్ర‌మంగా బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. తాజాగా ఇలాంటి కేసే ఒక‌టి వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం చేసుకుంది.. ఏకంగా 50 ల‌క్ష‌లు మాయం చేసి.. క‌నిపించ‌కుండా పోయింది ఓ మ‌హిళ‌. దీంతొ బ‌లోదిబో మంటూ బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. దేశ‌రాజ‌ధాని స‌మీపంలోని గ్రేట‌ర్ నోయిడాలో ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్ రెక్వెస్ట్ వ‌చ్చింది. అందులో తాను లండ‌న్‌కు చెందిన యువ‌తిని అని ప‌రిచ‌యం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు స్నేహితులుగా మారారు. ప‌లుమార్లు ఆ యువ‌తి బ‌హుమ‌తులు కూడా పంపింది ఉద్యోగికి. అయితే, ఇటీవ‌ల ఆ యువ‌తి తాను భార‌త్ చూడ‌టానికి వ‌స్తున్నాన‌నీ, త‌న క‌రెన్సీని ఎక్ఛేంజ్ చేసుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌నీ, త‌న అకౌంట్‌కు కొంత మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌మ‌ని స‌ద‌రు ఉద్యోగిని కోరింది. ఇలా త‌న అకౌంట్‌లో రూ.50 ల‌క్ష‌లు వేయించుకుంది.

భార‌త్ వచ్చి దేశ‌మంతా సంద‌ర్శిస్తాన‌ని చెప్పి త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుంద‌నీ, ఆ త‌రువాత కాల్ చేయ‌డం మానేసింద‌ని స‌ద‌రు ఉద్యోగి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. కేసు న‌మోదు చేసుకున్న సైబ‌ర్ సెల్ పోలీసులు, కిలాడీ మ‌హిళ వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. అయితే, అన్‌లైన్ కోనుగోళ్లు, ఆఫ‌ర్‌లు, సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని పోలీసులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.