ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ యాపిల్ భారత్‌లోని తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇండియాలో తన ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు యాపిల్ భారత్‌లో తన ప్రొడక్ట్స్‌ను థర్డ్ పార్టీ రీసెల్లర్ల ద్వారా విక్రయిస్తూ వచ్చింది. అయితే ఇకపై ఆన్లైన్ స్టోర్ ద్వారా తన ప్రొడక్ట్స్‌ను తానే నేరుగా కస్టమర్లకు విక్రయించనుంది. దీంతో వినియోగదారులు తమకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా నేరుగా యాపిల్ ఆన్ లైన్ స్టోర్‌నే సందర్శిస్తే చాలు. తమకు కావల్సిన యాపిల్ ప్రొడక్ట్స్‌ను క్షణాల్లో కొనుగోలు చేయవచ్చు.
ఇక యాపిల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా కస్టమర్లకు ఫిజికల్ స్టోర్‌ను సందర్శించిన అనుభూతి కలుగుతుందని యాపిల్ తెలియజేసింది. ఫిజికల్ స్టోర్‌లో కస్టమర్లు ఎలాగైతే చాలా సౌకర్యవంతంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవచ్చో.. అలాగే ఆన్‌లైన్‌లోనూ యాపిల్ ప్రొడక్ట్స్ గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అందుకుగాను కస్టమర్లకు సహాయం చేసేందుకు యాపిల్ ఎగ్జిక్యూటివ్‌లు అందుబాటులో ఉంటారు. వారు హిందీ లేదా ఇంగ్లిష్‌లో కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అలాగే వారికి ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. అనంతరం కస్టమర్లకు తమకు కావల్సిన ప్రొడక్ట్‌ను యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.
కాగా యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో యాపిల్‌కు చెందిన అన్ని రకాల డివైస్‌లను ఉంచుతారు. యాక్ససరీలు, యాపిల్ కేర్ ప్లస్ ప్రొడక్ట్, ఇతర ఉత్పత్తులు అన్నీ అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేందుకు పలు భిన్న రకాల పేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తారు. వినియోగదారులు యాపిల్ ప్రొడక్ట్స్‌ను క్రెడిట్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, రుపే కార్డులు, యూపీఐ తదితర పేమెంట్ ఆప్షన్లలో కొనవచ్చు. కొన్న వస్తువులను గిఫ్ట్ ప్యాక్ చేసి తమకు కావల్సిన భాషలో దానిపై రాసి అందించే సౌకర్యం కూడా యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక అక్టోబర్ నుంచి నిపుణుల ఆధ్వర్యంలో యాపిల్ ప్రొడక్ట్స్‌పై ఉచిత ఆన్ లైన్ సెషన్లను కూడా నిర్వహిస్తారు. వాటిల్లో కస్టమర్లు పాల్గొనవచ్చు.
వినియోగదారులు యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను పూర్తిగా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో డెలివరీ చేస్తారు. కస్టమర్లు యాపిల్ ప్రొడక్ట్స్ పట్ల తమకు ఉండే అన్ని సందేహాలను ఆన్లైన్లో తీర్చుకోవచ్చు. అలాగే మాక్ లాంటి ప్రొడక్ట్‌లను సెటప్ చేసుకునేందుకు అవసరమైన సహాయం కూడా చేస్తారు. https://www.apple.com/in/apple-store-online/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వినియోగదారులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈసైట్ ఈ నెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.