భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అందులో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కూడా ఉంది. అయితే టిక్‌టాక్ యాప్ బ్యాన్ అవడం ఏమోగానీ సరిగ్గా అలాంటి యాప్ అయిన చింగారికి అదృష్టం కలసి వచ్చింది. ఆ యాప్ డెవలపర్లు నిజంగా నక్కతోక చెప్పారని చెప్పవచ్చు. ప్రస్తుతం యాంటీ చైనా సెంటిమెంట్ నడుస్తుండడం, చింగారి యాప్ స్వదేశీ కావడంతో ఆ యాప్‌కు ఇప్పుడు ఆదరణ పెరిగింది. చింగారి యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్ల డౌన్లోడ్స్ను దాటిందని ఆ యాప్ డెవలపర్లు తెలిపారు.
కాగా చింగారి యాప్ గత వారం రోజుల నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకోబడుతున్న టాప్ ఫ్రీ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా చింగారి యాప్ కో ఫౌండర్ బిశ్వాత్మా నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ యాప్‌కు కొత్తగా వస్తున్న యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతుందన్నారు. అందుకు తగిన విధంగా యూజర్లకు సేవలు అందించేందుకు తమ టీం రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు.
కాగా గతంలో కేవలం 10 రోజల వ్యవధిలోనే ఈ యాప్ 3 మిలియన్ల డౌన్లోడ్లను పూర్తి చేసుకోగా, కేవలం 72 గంటల్లోనే 5 లక్షల డౌన్లోడ్లను పూర్తి చేసుకుంది. టిక్‌టాక్‌ను వాడే యూజర్లే పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని వెల్లడైంది. కాగా చింగారి యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మళయాళం, తమిళం, తెలుగు భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉంది.