శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను గెలాక్సీ ఎఫ్41 పేరిట విడుదల చేసింది. శాంసంగ్ సంస్థ ఎఫ్ సిరీస్‌ను కొత్తగా ఈ ఫోన్‌తో ప్రవేశపెట్టింది. దీంట్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్ ఫోన్లో 6.4 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. సూపర్ అమోలెడ్ తరహా డిస్ప్లే కావడం వల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్‌ను దీంట్లో అమర్చారు. 6జీబీ ర్యామ్ ఇందులో లభిస్తుంది. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌లు వేసుకోవచ్చు. వెనుకవైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ లను అమర్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ కు చెందిన 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 గా ఉంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 16 నుంచి విక్రయిస్తారు. అయితే త్వరలో జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.15,499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎస్బీఐ కార్డులతో అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.