భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీల మధ్య ఎంతటి పోటీ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే కంపెనీలు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రాన్షన్ హోల్డింగ్స్ అనే కంపెనీ కూడా ఈ మధ్య కాలంలో పలు ఆకట్టుకునే టెక్నో ఫోన్లను విడుదల చేసింది. ఇక తాజాగా అదే కంపెనీ టెక్నో కామన్ 16 పేరిట భారత్‌లో తాజాగా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీంట్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉంది.
టెక్నో కామన్ 16 స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిజైన్, లుక్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక కంపెనీలకు చెందిన ఫోన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో 6.8 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా, దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి సపోర్ట్‌గా 4జీబీ ర్యామ్ ఉంటుంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను ఇచ్చారు. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. దీనికి తోడుగా మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, ఏఐ లెన్స్, పెంటా ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయించనున్నారు.