కాల్ ఎత్తాలంటే.. కారణం చెప్పాల్సిందే.. లేదంటే?

నిజ జీవితంలో మనకు అవసరం లేని ఎన్నో కాల్స్ మన్నల్ని వేదిస్తుంటాయి. వద్దనుకున్నా అక్కడి నుంచి కాల్స్ రావడం మాత్రం ఆగదు. అదేనండి మార్కెట్ ప్రమోషన్స్ కి సంబంధించిన కాల్స్ చాలా మందికి వస్తూనే ఉంటాయి కదా.. అవి అవసరం లేదని చెప్పినా వినే వారుండరు. అలాంటి కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.

కాల్ రీజన్ పేరుతో వస్తున్న ఈ కొత్త ఫీచర్ అవతలి నుంచి ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎందుకు ఫోన్ చేస్తున్నారో ఇట్టే కనిపేట్టేస్తుంది. ఎవరైనా మీకు ఏదైనా ప్రొడక్ట్ అమ్మదలచుకునే వారు మీకు కాల్ చేస్తే వెంటనే ఫోన్ డిస్ ప్లే మీద కాల్ రీజన్లో మీకు సేల్ కోసం అని మెసేజ్ వస్తుంది. దాంతో మీరు ఆ కాల్ ను రిసీవ్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చన్నమాట. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్స్ కి స్పామ్ కాల్స్ నుంచి విముక్తి కలుగుతుందని ట్రూకాలర్ తెలుపింది.

ఈ కాల్ రీజన్ లోకూడా రకాలు ఉన్నాయి. అవి పర్సనల్, బిజినెస్, అర్జంట్ అని మూడు ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవతలి వ్యక్తికి ఫోన్ చేసే ప్రతి సారి వీటిలో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ మూడు కారణాలు కూడా కాదంటే దాన్ని రీజన్ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు చేస్తే మీరు ఎందుకు కాల్ చేస్తున్నారో అవతలి వ్యక్తి తెలుసుకోవచ్చు. ఒక వేళ రీజన్ బాక్స్ మీకు అవసరం లేదనుకుంటే దాన్ని డిజెబుల్ చేసుకోవచ్చు.

ఈ ఫెసిలిటీ కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్ కి కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. గూగుల్ మెషీన్ లెర్నింగ్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీనితో పాటుగా ట్రూకాలర్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఎస్సెమ్మెస్ షెడ్యూలింగ్, ఎస్సెమ్మెస్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ ని కూడా పరిచయం చేసింది.