కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తుండగా, రెండు రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళన తీవ్ర తరం అయ్యింది. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించాయి. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని నిన్న బండి సంజయ్ పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పారిశ్రామిక జోన్ లో సాగు భూములు కలపవద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

కార్యకర్తల తో కలిసి బండి సంజయ్ అకస్మాత్తుగా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దాడి తీసింది. కలెక్టరేట్ లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కలెక్టరేట్ ముందు పెట్టిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగడంతో పోలీసులు బండి సంజయ్ తో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. అనంతరం బండి సంజయ్ ను హైదరాబాద్ తరలించారు.
తాజజాగా బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టడం, కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డిలో ఉద్రిక్తతలకు కారణమైన మరో 25 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. కామారెడ్డిలో సెక్షన్ 30 అమలులో ఉందని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి శివారులో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని పొలాల వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు.
మరో పక్క కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 500 మందికి పైగా రైతులు మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చారు. మిగిలిన రైతులు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేననీ, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనని, రైతులు, పార్టీల నేతలు అర్ధం చేసుకోవాలని అన్నారు.అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామని, వారి అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు.