ఏఐ ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఒవైసీ రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దమని ఏఐసీసీ సభ్యుడు జి నిరంజన్ పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీకి రాజేంద్రనగర్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఓటు హక్కు ఉందని చెప్పారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు నిరంజన్. పార్లమెంట్ సభ్యుడి బాధ్యతారాహిత్యాన్ని, ఎన్నికల యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అసదుద్దీన్ ఒవైసీకి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నట్లుగా గుర్తించిన తాను రెండు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసినట్లు నిరంజన్ వెల్లడించారు. తన ఫిర్యాదులో ఓటరు జాబితాలను కూడా జత చేస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు నిరంజన్. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ, ఈసీ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. రీసెంట్ గా ఎన్నికల సంఘం తెలంగాణ, ఏపిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసి వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కి చేరింది. జనవరి 5 నాటికి ఏపిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99, 84, 868 గా పేర్కొంది ఈసీ.
లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్