Amit Shah: బీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గద్వాలలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసిఆర్ నిలబెట్టుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ టైమ్ అయిపోయిందని, బీజేపీ వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని అన్నారు.
అబద్దపు మాటలతో ప్రజలను కేసిఆర్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు అమిత్ షా. బీజేపీకి ఓటేస్తే సుస్ధిర ప్రభుత్వం ఏర్పడుతుందని అందుకు ప్రజలు కూడా మద్దతు పలకాలని కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి పుణ్య స్థలానికి రావడం తన అదృష్టంగా పేర్కొన్న అమిత్ షా .. జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోడీ సర్కార్ రూ.70 కోట్లు కేటాయించిందన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఇస్తామన్న సీఎం కేసిఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
వంద కోట్లు ఇవ్వకపోగా, మోడీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదన్నారు. గుర్రంగడ్డ వంతెన ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని అన్నారు. కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకాపూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు.
అబద్దాలు చెప్పడంలో సీఎం కేసిఆర్ రికార్డు సృష్టించారని విమర్శించారు అమిత్ షా. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు 2జీ, 3జీ, 4 జీ పార్టీలని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారని అన్నారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రానికితొలి బీసీ సీఎం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చామని తెలిపారు.
బీజేపీకి అధికారం ఇస్తే అయిదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భారీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలానే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
Vijayasanthi: బీజేపీ అధిష్టానంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు .. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందంటే..?