హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పలువురు అసువురు బాశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలు మరువకముందే రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చేటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్గి రాజుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఈ ప్రమాదం కారణంగా గోడౌన్ లోని రెండు డీసీఎం వ్యాన్ లు దగ్దం అయ్యాయి. ప్లాస్టిక్ కాలిన ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాద స్థలానికి దూరంగా పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పది ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. గోడౌన్ కు పక్కనే పాఠశాల ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తం చేసి ఖాళీ చేయించారు. పాఠశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రం ఉండటంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తొంది. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని భావిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లు నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే కాని ప్రాణనష్టం ఏమి లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.