Barrelakka Sirisha: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్ధి శిరీష అలియాస్ బర్రెలక్క సోదరుడిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం అయ్యింది. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిల్చిన స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క తన దైన శైలిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి యువత నుండి విశేష స్పందన లభిస్తొంది.
తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని పలువురు ముఖ్యనేతలు పలుమార్లు ఒత్తిడి తెచ్చారని, తాజాగా మంగళవారం తన తమ్ముడు చండి (భరత్ కుమార్) ప్రచారంలో పాల్గొన్న వారికి భోజనాలు తెస్తున్న క్రమంలో వెన్నచర్ల వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని బర్రెలక్క పేర్కొన్నారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు పారిపోయారన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కు ఫోన్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేశారు శిరీష. తాను వెంటనే స్పందించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తనకు ప్రాణగండం పొంచి ఉన్నందున భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరుద్యోగులతో కలిసి దర్నాకు దిగారు బర్రెలక్క. ఈ దాడికి పాల్పడింది ఏ పార్టీ వారు అనేది తెలియదని, తాను ఎన్నికల బరిలో ఉంటే ఓట్లు చీలుతాయనే భయంతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. దాడి విషయం తెలుసుకున్న హైకోర్టు న్యాయవాది రామేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బర్రెలక్క తరపున ఆమె భద్రత కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర కలకలాన్ని రేపింది.
Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం .. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి