తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో సారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా అవకాశం కల్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్(బీసీ) సామాజికవర్గానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ సామాజిక వర్గ ఓటింగ్ ను ఆకర్షించేందుకు టీడీపీ .. కాసానికి పెద్ద పీట వేయడంతో అదే సామాజికవర్గానికి చెందిన నేతకు కేసిఆర్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

ఆదివారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ కు సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బండా ప్రకాశ్ డిప్యూటీ చైర్మన్ కావడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సామాన్య జీవితం నుండి బండా ప్రకాష్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారంటూ ఈ సందర్భంగా ప్రశంసించారు. బండా ప్రకాష్ ..1981 లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు. 2018 మార్చి 23న టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2021 నవంబర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడుగానూ ఉన్నారు.

మంత్రి కేటిఆర్ తదితర మంత్రులు బండా ప్రకాష్ కు అభినందనలు తెలియజేస్తూ ముదిరాజ్ కమ్యూనిటీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అధికార బీఆర్ఎస్ తీసుకున్న ఈ కీలక చర్యతో ముదిరాజ్ సామాజికవర్గం ఏకపక్షంగా కాసాని వైపు మళ్లకుండా అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బండా ప్రకాష్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల ఆ సామాజికవర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?
‘అధికారిణికి ప్రభుత్వం చేసిన అన్యాయం’