Barrelakka: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువతి శిరీష అలియాస్ బర్రెలక్క రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకట్టుకుంది. వినూత్న ప్రచారంతో సోషల్ మీడియాలో దూసుకువెళ్తొంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో శిరీష చేస్తున్న ప్రచారం యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శిరీషకు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు ను కేటాయించింది. దీంతో ఆమె విజిల్ వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తొంది. నామినేషన్ ఉపసంహరించుకోక పోతే తనను చంపేస్తామని కొందరు భయపెట్టారనీ, కానీ తాను ధైర్యంగా బరిలో ఉన్నానని శిరీష చెబుతోంది. ‘కదిలే ఓ అడుగు..యువతకు నువ్వు వెలుగు..కదిలింది మన బర్రెలక్క.. అదిగో లేవర యువత’ అంటూ సాగుతున్న పాట సోషల్ మీడియా, యూట్యూబ్ ను షేక్ చేస్తొంది. దైర్యంగా బరిలో ఉన్న బర్రెలక్క కు మనం మద్దతుగా నిలుద్దాం అంటూ నిరుద్యోగులు ముందుకు వచ్చారు.
శిరీష ఎన్నికల ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసిన యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పందిస్తూ ఆమెకు లక్ష విరాళాన్ని పంపించారు. విద్యార్ధి సంఘాల నేతలు, నిరుద్యోగ యువత ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ స్పందన ఓట్ల రూపంలో ఎంత వరకు మారుతుంది అనేది..?ఈ ప్రభావం ఏ అభ్యర్ధి పై పడుతుంది..? అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే .. ఈ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పక్షాల నుండి ఇద్దరు ఉద్దండులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు.
జూపల్లి కృష్ణారావు 1999 నుండి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత స్వతంత్ర అభ్యర్దిగా, ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా, తదుపరి రెండు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు నాటి కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్థన్ రెడ్డిపై 10,498 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు 12,546 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు మళ్లీ పార్టీలు మారి ప్రత్యర్ధులు గా నిలిచారు.
Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు ‘సన్’ స్ట్రోక్