Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు చలికాలంలో ఏమిటి సన్ స్ట్రోక్ అని అనుకుంటున్నారా..? ఇది సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ కాదు..సన్ (కుమారుడి దెబ్బ) స్ట్రోక్. బాబూ మోహన్ ఆంథోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడిన బాబూ మోహన్ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ తండ్రికి వ్యతిరేకంగా మారాడు. ఉదయ్ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఉదయ్ బాబూ మోహన్ తండ్రికి వ్యతిరేకంగా మారి టికెట్ కోసం ప్రయత్నించారు. పార్టీ అధిష్టానం కూడా ఉదయ్ పేరు పరిశీలన చేసింది. బీజేపీ ప్రకటించిన అభ్యర్ధుల తొలి జాబితాలో బాబూ మోహన్ పేరు ప్రకటించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నేఫథ్యంలో బాబూమోహన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు బాబూ మోహన్ తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు బాబూ మోహన్. అర్హులకే టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలను తాను కోరుతున్నానని నాడు చెప్పారు. పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయని, ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లనే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను ఫోన్ చేస్తే .. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ స్పందించడం లేదని, తనను కావాలనే పార్టీ దూరం పెట్టిందని కూడా సంచలన కామెంట్స్ చేశారు.
అయితే అభ్యర్ధుల రెండో జాబితలో బీజేపీ బాబూమోహన్ కు ఆంథోల్ అభ్యర్ధిత్వం ఖరారు చేసింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బాబూమోహన్ బీఆర్ఎస్ లో చేరగా, ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓటింగ్ ఏమీ లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్శింహ పోటీలో ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బుర్రి ఎల్లయ్య కు 3,276 ఓట్లు రాగా, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బాబూ మోహన్ కు కేవలం 2,404 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బాబూ మోహన్ కేవలం 3,291 ఓట్ల మెజార్టీతో దామోదర రాజనర్శింహపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో దామోదర రాజనర్శింహపై టీఆర్ఎస్ అభ్యర్ధి క్రాంతి కిరణ్ 16,455 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Election 2023: ఎవరికెవరు దోస్తులు .. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న పార్టీలు