ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ ఇటీవల ఆయన భద్రతను కుదిస్తూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు 3 ప్లస్ 3 పోలీస్ భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2 కి తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్ ను, నివాసం వద్ద ఉండే గన్ మెన్ లను కూడా తొలగించింది. ఈ అంశం ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ అంశంపై బీజేపీ నేత గల్లా సత్యనారాయణ స్పందించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ఎస్ లో పొంగులేటికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని బీజేపీ నేత గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ మారతారన్న ఉద్దేశంతోనే ఆయనకు ఉన్న సెక్యురిటీని తగ్గించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పించకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా తామే పొంగులేటికి భద్రత కల్పిస్తామంటూ ఆయన సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.

పొంగులేటి గత కొంత కాలంగా సొంత పార్టీ బీఆర్ఎస్ పైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జనవరి 1వ తేదీన పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం నిర్వహించడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని పొంగులేటి ప్రకటించారు. అంతకు ముందు కూడా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం పొంగులేటిపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పొంగులేటికి భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి వివిధ హోదాల్లో పని చేశారు. 2013లో వైసీపీ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంత కాలం పని చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఖమ్మం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ టికెట్ ఆశించినా పార్టీ అధిష్టానం నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఆయన గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత ఆయనకు పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఏ పదవీ రాలేదు. ఆ నేపథ్యంలో పొంగులేటి పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయితే ఆ ప్రచారాన్ని పొంగులేటి ఖండిస్తూ పార్టీలోనే కొనసాగారు.

జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక అనుచరవర్గం, అభిమానులు కల్గి ఉన్న పొంగులేటిని పార్టీ లో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో బీజేపీలో బలోపేతం అవుతోందని ఆ పార్టీ భావిస్తుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉన్న నేతకు తాము కేంద్ర ప్రభుత్వం ద్వారా భద్రత కల్పిస్తామని బీజేపీ నేత పేర్కొనడంతో పొంగులేటి బీజేపీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారనీ, ఆయనను పార్టీ చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది అన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పొంగులేటికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల్లో పొంగులేటి రాజకీయ భవితవ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.