తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ పదేపదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. కేసిఆర్ తన ప్రసంగంలో పది సార్లకు పైగా మిత్రుడు రాజేందర్ చెప్పినట్లు అని మాట్లాడటడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేసిఆర్ మాట్లాడిన మాటల వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందంటూ చర్చించుకున్నారు. బీజేపీ చేరికల కమిటీ కమిటీకి చైర్నన్ గా ఉన్న ఈటల పేరు ను కేసిఆర్ ప్రస్తావించే సమయంలో ఘర్ వాపరీ అంటూ అసెంబ్లీలో సభ్యులు నినాదాలు చేశారు. ‘మొన్నటి వరకూ ఇటు వైపు ఉండి.. నిన్న అటు వైపు వెళ్లినంత మాత్రాన, బీజేపీ వైఖరి ఏంటో ఈటల రాజేందర్ కు తెలియదా’ అని కేసిఆర్ ప్రశ్నించారు. ఆనాడు తమకు సన్న బియ్యం సలహా ఇచ్చింది ఈటలేనని కేసిఆర్ వెల్లడించారు. కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన నామకరణం కూడా మా ఈటల ఆలోచనే అని తెలిపారు. డైట్ చార్జీలు పెంచాలని ఈటల కోరారు.. పెంచుతున్నాం అని కేసిఆర్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈటలకు ఫోన్ చేసి సూచనలు, సలహాలు, తీసుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా ఈటల మాట్లాడిన మాటల్లో ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలని మంత్రి హరీష్ రావుకు కేసిఆర్ సూచించారు.

దీనీపై ఈటల స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసిఆర్ అలా మాట్లాడారనీ ఈటల అన్నారు. ఇక అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్ లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదనీ, గెంటేసిన వాళ్లు పిలిచినా పోను అని ఈటల స్పష్టం చేశారు. వైఎస్ హయాంలోనూ కూడా ఇలానే ప్రచారం చేశారనీ, ఇవేళ అసెంబ్లీలో సీఎం కేసిఆర్ తన పేరు ప్రస్తావించారని పొంగిపోనని అన్నారు. తన మీద జరిగిన దాడిని మర్చిపోనని స్పష్టం చేశారు ఈటల. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సైనికుడిలా పని చేశాననీ, ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పని చేస్తానని వెల్లడించారు. ‘నాకు నేనుగా పార్టీ నుండి వెళ్లిపోలేదు. వాళ్లే నన్ను పార్టీ నుండి గెంటివేశారు. అసెంబ్లీలో నా సొంత అజెండా ఏమీ ఉండదు. ఈ సభలో వాళ్లు చెప్పిందంతా మేం నమ్ముతామని బీఆర్ఎస్ అనుకుంటోంది. మమ్మల్ని తిట్టడానికే సభా సమావేశాలు ఏర్పాటు చేశారు. సంఖ్యా బలం ఉండడటంతో గంటల కొద్దీ మాట్లాడారు. జనాలను మభ్యపెట్టి మాయ చేయాలని చూశారు’ అని ఈటల విమర్శించారు.
లెక్కలు చెప్పి మరీ మోడీ సర్కార్ పై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసిఆర్