BRS Vs Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గతంలో కేసిఆర్ వాడిన భాషలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను, అవినీతిని గట్టిగా ఎత్తిచూపుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ యాడ్స్ కూడా బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళన కల్గిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది.
ఈ క్రమంలో ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బీఆర్ఎస్ లీగల్ టీమ్ మరో సారి సీఈఓ వికాస్ రాజ్ కు వినతి పత్రం అందజేసింది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేదం విధించాలని బీఆర్ఎస్ కోరడం హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి పదేపదే కార్యకర్తలను రెచ్చగొడుతూ దాడులను ప్రోత్సహరిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి పై దాడిని కనీసం ఖండించకుండా కామెడీ చేస్తున్నారన్నారు. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ దాడి చేశారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లనే బీఆర్ఎస్ అభ్యర్ధులపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రేవంత్ రెడ్డి హింసాత్మకంగా మార్చుతున్నారని ఆరోపించారు భరత్. ఈసీ నిషేదించిన ప్రకటనలను కూడా బ్యాన్డ్ అని పెట్టి మరీ కాంగ్రెస్ నేతలు ప్రసారం చేస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్ధులపై దాడి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ తో ఆడుతున్నడ్రామా అని, సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నాలని కాంగ్రెస్ కొట్టిపారేస్తొంది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఒత్తిడితో కాంగ్రెస్ ప్రకటనలపై ఈసీ నిషేదం విధిస్తొందని కాంగ్రెస్ అరోపిస్తొంది. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలు, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా యాడ్ లు బీఆర్ఎస్ ను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయనీ అందుకే రేవంత్ ప్రచారంపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.