తెలంగాణలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అన్ని పార్టీలు కదనరంగంలో పోటీకి సై అంటున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కేంద్రంలోని అధికార బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన పార్టీ అధినేత కేసిఆర్ కు సొంత రాష్ట్రంలో గట్టి దెబ్బ వేసి ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సవాల్ విసరాలని చూస్తొంది. ఇదే క్రమంలో కర్ణాటకలో సాధించిన విజయాన్ని స్పూర్తి గా తీసుకుని తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఘర్ వాపసీ అంటూ పార్టీ నుండి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుని బలోపేతం అయ్యేందుకు తలుపులు బార్లా తెరిచింది కాంగ్రెస్. మరో పక్క ఈసారి కూడా గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టి తెలంగాణ గడ్డ కేసిఆర్ అడ్డా అని నిరూపించుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.

సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్ లు
ఇదే క్రమంలో ప్రభుత్వ పరంగా వివిధ వర్గాలకు మేలు చేస్తూ ఆ వర్గాల ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా చూసుకుంటున్నారు. మరో పక్క పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఆ పార్టీ నేతలకు ఓ కీలక సూచన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ లు తమ బంధువులకు టికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దని కోరింది. జాతీయ పార్టీగా మార్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో గెలుపు గుర్రాలకే టికెట్ లు కేటాయించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో పేరు, ప్రఖ్యాతులు, సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది.
వారసులకు, బంధువులకు నేతల ఒత్తడి
బీఆర్ఎస్ లోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఎన్నికల్లో తమ వారసులు గానీ బంధువులకు గానీ టికెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను పార్టీ అధినేత, సీఎం కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ల వద్ద తీసుకువస్తున్నారు. వివిధ కారణాలతో తమకు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో మరి కొంత మంది తమ బంధువులకే టికెట్ లు ఇవ్వాలని కోరుతున్నారు. నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం కొనసాగించుకునేందుకు ఆ సీనియర్ లు తాపత్రయ పడుతున్నారు. అయితే వీరి ఆశలకు నీళ్లు చల్లేలా పార్టీ అధిష్టానం తమకు సిఫార్సులు చేయవద్దని, సర్వే ఆధారంగానే గెలుపు గుర్రాలకే టికెట్ లు ఇవ్వడం జరుగుతుందని చెబుతోందట.
బన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన వయసు, ఆరోగ్యం వంటి కారణాలు చూపుతూ తన స్థానంలో ఇద్దరు కుమారుల్లో ఒకరికి టికెట్ కేటాయించాలని సీఎం కేసిఆర్ వద్ద కోరారుట. అయితే ఆ నియోజకవర్గంలో సర్వే ఆధారంగా శ్రీనివాసరెడ్డికే జనాలు మొగ్గుచూపుతున్నందున ఆయన ప్రతిపాదనను కేసిఆర్ నిరాకరించారనీ, మళ్లీ పోటీకి సిద్దం కావాలని శ్రీనివాసరెడ్డికే కేసిఆర్ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఒక సిగ్మెంట్ నుండి తన కుమారుడు టి సాయి కిరణ్ యాదవ్ కు అవకాశం కల్పించాలని కోరుతున్నారుట. సాయి కిరణ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు.
అదే విధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్లొండ లేదా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టికెట్ కోరుతున్నారుట. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన తనయుడు జోగు ప్రేమేందర్ కు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన తనయుడు ప్రశాంత్ రెడ్డికి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మత్ షిండే తన తనయుడు హరీష్ షిండే కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారుట. అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం క్షేత్ర స్థాయి రిపోర్టు ఆధారంగానే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేస్తొందని సమాచారం. పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయం ఆ సీనియర్ లకు షాకింగ్ గా మారింది.
Breaking: వైఎస్ వివేకా కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ..హైకోర్టు ఉత్తర్వులతో బెయిల్