Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత రాత్రి 9,40 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. కవిత ఇవేళ మొత్తం పది గంటల పాటు ఈడీ కార్యాలయంలో ఉండగా, ఆమెను సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపు అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు.

ఈ గ్రూప్ ను శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ లు నియంత్రించారని ఈడీ ఆరోపిస్తొంది. కాగా కవిత వాడిన పది ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే తన ఫోన్లు అన్నింటినీ ఇవేళ కవిత ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ అధికారులకు అందజేయడం ఆసక్తి కల్గించింది. వరుసగా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన ఈడీ అధికారులు కవితను మరో సారి విచారణకు రమ్మని ఆదేశించారా లేదా అన్నది తెలియ రాలేదు. అయితే వచ్చే వారం మరో సారి కవితను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కవిత నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషణ చేసిన తర్వాత తిరిగి మరో సారి విచారణకు రమ్మని పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో వైపు ఎమ్మెల్సీ కవితను ఇవేళ ఫోన్ల పైనే ప్రధానంగా విచారణ జరిపినట్లు తెలిసింది. ఈడీ అధికారులు కోరిన డాక్యుమెంట్లను కూడా కవిత న్యాయవాది సోమా భరత్ తీసుకువచ్చి అందజేశారు. కవితను ఇప్పటికే మూడు సార్లు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరో పక్క కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24వ తేదీ సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. అయితే ఈ విచారణలో కవితకు సానుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టు కావడంతో కవిత అరెస్టుపైనా పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదనీ, ఈ కేసుతో ఏ ప్రమేయం లేదని, రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే తనపై అభియోగాలు మోపుతున్నారని కవిత పేర్కొంటున్నారు. ఈ కేసు అంశంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై అమ్ అద్మీ పార్టీ, బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తొంది.
మార్గదర్శి కేసులో రామోజీకి బిగ్ రిలీఫ్ .. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు