Telangana Assembly Elections: బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వేళ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ కుచికుల దామోదరరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను సీఎం కేసిఆర్ కు దామోదర్ రెడ్డి పంపించారు. స్థానిక సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగున్న సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో కేసిఆర్ నాయకత్వంలో పని చేయడం జరిగిందని, పార్టీ తగినంత గుర్తింపు ఇచ్చినప్పటికీ స్థానిక ఇబ్బందులను సీఎం కేసిఆర్ పట్టించుకోకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దామోదరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 15 రోజులకు ఒక సారి వెళ్లి కలిసే వాడిననీ, కానీ కేసిఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం ఒక్క సారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. పది సార్లు వెళ్లినా.. కనీసం కలవలేదన్నారు. పార్టీ పరంగా తనకు సముచిత స్థానం కల్పించినప్పటికీ .. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ కు రాజీనా చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఎటువంటి ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అన్న రీతిలో కేసిఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు.
కేటిఆర్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని అన్నారు. కాగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితో విభేదాల కారణంగానే కుచికుల్ల రాజీనామా చేశారని భావిస్తున్నారు. గత నాలుగు నెలల నుండి దామోదరరెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. దామోదరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006 లో నాగర్ కర్నూలు జడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
అయిదు సార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాగం జనార్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానిక రెండు సార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
TDP Janasena Alliance: టీడీపీ – జనసేన పొత్తు .. ఆ పెద్దాయన సీటుకు ఎసరు వచ్చినట్లే(నా)..!